ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తీరత్ సింగ్ రావత్

0
668

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ బేబీ మౌర్యకు అందజేశారు. నాలుగు నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తీరత్ సింగ్ ఆరు నెలల లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది. రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. గడువు ముగిసే వరకు పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

తీరత్ సింగ్ రావత్ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గవర్నర్ దగ్గరకు చేరుకుని రాజీనామా పత్రాలను సమర్పించారు. అంతకుముందు గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలవనున్నట్లు తెలియజేయడానికి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో నాయకత్వ మార్పుపై ఊహాగానాల మధ్య తీరత్ సింగ్ రావత్ బీజేపీ నాయకత్వాన్ని కలిశారు. ఖాళీగా ఉన్న రెండు స్థానాలు – హల్ద్వానీ మరియు గంగోత్రాలలో ఉప ఎన్నికలను ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై స్పష్టత లేకపోవడంతో ఆయన రాజీనామా జరిగింది.

తీరత్ సింగ్ రావత్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. వచ్చే రెండు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవసరం ఉంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ పదవీకాలం మార్చిలో ముగిసిపోనుండడమే కాకుండా.. కేవలం తొమ్మిది నెలల దూరంలో ఉండడంతో ఉత్తరాఖండ్‌లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఎలెక్షన్ కమీషన్ ఉప ఎన్నికకు ఆదేశించకపోవచ్చని బీజేపీలోని పరిశీలకులు భావిస్తున్నారు. రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడానికి తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఈసారి సిట్టింగ్ అభ్యర్థికే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నాయకుల పేర్లు సత్పాల్ మహారాజ్, బన్షిదర్ భగత్, హరక్ సింగ్ రావత్, ధన్ సింగ్ రావత్ పేర్లు రావత్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉన్నాయి.

గత మూడు రోజులుగా హస్తినలోనే మకాం వేసిన తీరత్ సింగ్ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం తన రాజీనామా లేఖను అందించారు. తీరత్ సింగ్ ప్రస్తుతం గర్వాల్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శనివారం జరగనున్న పార్టీ సమావేశంలో కొత్త శాసనసభా పక్ష నేతను ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్ అధ్యక్షత వహిస్తారని రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్‌ఛార్జి మన్వీర్ సింగ్ చౌహాన్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలందరూ సమావేశానికి హాజరు కావాలని కోరారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here