మార్చి 10న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో కూడా బీజేపీదే విజయమని అంటున్నారు. మీరట్‌లోని హస్తినాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్‌దళ్ అభ్యర్థి యోగేష్ వర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. అక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని EVM కౌంటింగ్ సైట్ బయట బైనాక్యులర్‌లతో కనిపించారు. అక్కడే ఉండాలని కూడా నిర్ణయించుకున్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్, పరిసర ప్రాంతాలపై ఆయన నిఘా పెట్టారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, దాని చుట్టూ ఉన్న ఇతర కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించిన తర్వాత యోగేష్ వర్మ ఇలా సందడి చేశారు. “మేము 8 గంటల పాటూ మూడు షిఫ్టులలో పని చేస్తాము. ఎగ్జిట్ పోల్స్‌పై మాకు నమ్మకం లేదు, అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారు. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం” అని వర్మ మీడియాతో అన్నారు.
జిల్లా యంత్రాంగం అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఉన్న స్థలాన్ని సర్ధాన, సివల్‌ఖాస్, హస్తినపూర్ నియోజకవర్గాలకు కౌంటింగ్ కేంద్రంగా మార్చింది. ఆదివారం, వర్మ ఓపెన్ జీపులో విశ్వవిద్యాలయానికి చేరుకుని, తన వాహనాన్ని 400 మీటర్ల దూరంలో నిలిపి, బైనాక్యులర్ ద్వారా స్ట్రాంగ్‌రూమ్‌ను తనిఖీ చేయడం ప్రారంభించాడు. తాను ఆ బైనాక్యులర్స్ సహాయంతో 3 కిలోమీటర్ల పరిధిలోని విషయాలపై నిఘా ఉంచగలనని వర్మ తెలిపారు. మార్చి 10 వరకు తాను నిఘా ఉంచుతానని, ఎన్నికల్లో రిస్క్ తీసుకునే స్థితిలో ఎస్పీ లేదని ఆయన అన్నారు. ప్రతి అభ్యర్థిలో ఒకరికి స్ట్రాంగ్ రూమ్‌కు దగ్గరగా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిందని, అక్కడ వారు ప్రధాన ద్వారం వద్ద నిఘా ఉంచవచ్చని వర్మ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ నమ్మశక్యం కావని కూడా యోగేష్ వర్మ అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఉదాహరణను ఉదహరిస్తూ, ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పాయని.. మమతా బెనర్జీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తాము నమ్మడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, ఎన్నికల కమిషన్ అధికారులే ఈ పని చేశారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారులతో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని అఖిలేశ్ యాదవ్ చెప్పుకొచ్చారు.