More

    యూపీలో ఘోర ప్రమాదం.. చెల్లా చెదురైన శరీర భాగాలు..!

    ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో పేలుడు కారణంగా 12 మంది మ‌ర‌ణించ‌గా, మ‌రో 21 మంది గాయ‌ప‌డ్డారు. హాపూర్ జిల్లా ధౌలానాలోని పారిశ్రామిక ప్రాంతంలో ఎల‌క్ట్రానిక్ ప‌రికరాల‌ను త‌యారు చేసే ఓ కంపెనీలో శ‌నివారం బాయిల‌ర్ పేలింది. దీంతో మంట‌లు ఎగిసిప‌డ్డాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బందికి వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంట‌ల పాటు శ్ర‌మించి అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. పేలుడు ధాటికి 12 మంది మ‌ర‌ణించగా.. మ‌రో 21 మంది గాయ‌ప‌డ్డారు. వారిని చికిత్స నిమిత్తం స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పేలుడు ధాటికి ప‌క్క‌నే ఉన్న ప‌లు ఫ్యాక్టరీల పై క‌ప్పులు ఎగిరిపోయాయి.

    ఈ ప్ర‌మాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలియ‌జేశారు. ‘ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి చికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పాల్గొంటోంది.’ అని మోదీ ట్వీట్ చేశారు.

    ఘటనా స్థలంలో గన్‌పౌడర్‌ కనిపించిందని దర్యాప్తులో పాల్గొన్న సీనియర్ అధికారి తెలిపారు. “ఎలక్ట్రానిక్స్ తయారీకి మాత్రమే లైసెన్స్ కలిగి ఉన్న ఫ్యాక్టరీలో అనుమానాస్పదంగా ఏదో ఉత్పత్తి చేయబడిందని మేము భావిస్తున్నాము” అని అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. కర్మాగారానికి సమీపంలో ఉన్న ధౌలానా గ్రామంలో ఒక్కసారిగా తమ ఇళ్లు, దుకాణాలు భూకంపం వచ్చినట్లు అదిరాయని గ్రామస్థులు పోలీసులకు చెప్పారు. పేలుడు వార్త తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మీరట్‌ జోన్‌ ఐజీ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఎస్పీ దీపక్‌ బుకర్‌, డీఎం మేధా రూపమ్‌ సహా సీనియర్‌ పోలీసు, జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పేలుడు జరిగినప్పుడు సిఎన్‌జి పెట్రోల్ పంప్‌కు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీలో సుమారు 50 మంది పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన పలువురిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

    Trending Stories

    Related Stories