National

యూపీలో ఘోర ప్రమాదం.. ప్రధాని దిగ్భ్రాంతి..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గత రాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 18 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. లక్నోకు 28 కిలోమీటర్ల దూరంలో బారాబంకీ జిల్లా రాంస్నేహిఘాట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్యానా నుంచి కూలీలతో బీహార్‌ వెళ్తున్న బస్సు కొన్ని కారణాల వలన ఆగిపోయింది. దీంతో బస్సును బాగు చేస్తుండగా అందులోని కూలీలు కిందికి దిగి దాని ముందు రోడ్డుపై నిద్రపోయారు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై నిద్రిస్తున్న కూలీల్లో 18 మంది అక్కడికక్కడే మరణించారు. వీరందరూ బీహార్‌కు చెందిన వారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఒక అధికారి మాట్లాడుతూ డబుల్ డెక్కర్ బస్సు హర్యానాలోని పాల్వాల్, హిసార్ జిల్లాల నుండి బీహార్ వరకు సుమారు 100 మంది ప్రయాణికులను తీసుకువెళుతోందని తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అధికారి చెప్పారు.

ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ .2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇస్తామని పిఎంఓ తెలిపారు. “ఉత్తర ప్రదేశ్ లోని బారాబంకిలో జరిగిన రోడ్డు ప్రమాద వార్తలతో చాలా బాధపడ్డాను. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. సిఎం యోగి జీతో కూడా మాట్లాడాను. గాయపడిన వారందరికీ సరైన చికిత్స కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి ”అని ప్రధాని ట్వీట్ చేశారు.

ఈ సంఘటన పట్ల దేశ అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. “ఈ రోడ్డు ప్రమాదంలో మరణించారన్న వార్త తెలిసి బాధపడ్డామని.. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడినవారికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, ”అని ట్వీట్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − 9 =

Back to top button