యువతకు 9 లక్షల ఫోన్స్, ట్యాబ్స్ ఇస్తున్న యోగి సర్కార్.. మరో వైపు నేరస్తుల ఇళ్లపై బుల్డోజర్స్

0
1021

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9.74 లక్షల టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా అందరికీ అందించాలని.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అధికారులు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోవడంతో విద్యపై తీవ్ర ప్రభావం పడింది. యువత విద్యకు ఆటంకం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ విద్యను ప్రారంభించింది, అయితే చాలా మందికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలియకపోవడమే దీనికి ప్రధాన అడ్డంకిగా మారింది. బీజేపీ తన సంకల్ప్ పత్రలో భాగంగా.. 2 కోట్ల మంది యువతకు ట్యాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను అందించి వారిని సాంకేతికంగా సామర్థ్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం తన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో యువతకు 9.74 లక్షల టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను అందజేయాలని చేర్చింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించింది. అవసరమైన అన్ని చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని, యువతకు నిర్ణీత గడువులోగా ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల అధికారులను ఆదేశించింది. ప్రతి జిల్లాకు సంబంధించి ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్‌ల కోసం అర్హులైన విద్యార్థులు/లబ్దిదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేరస్థుల అక్రమ ఆస్తులపై బుల్డోజర్లతో దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. శుక్రవారం, సీఎం యోగి అధికారులకు కఠినమైన ఆదేశాలు ఇస్తూ.. ఏ పేద గుడిసె లేదా దుకాణంపై బుల్డోజర్ నడపరాదని చెప్పారు. పేదల పట్ల సున్నితంగా వ్యవహరించాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. నేరాలు, నేరస్తుల పట్ల ఏమాత్రం సహనం వహించరాదని, పేదల పట్ల సున్నితంగా వ్యవహరించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు స్పష్టంగా చెప్పారు. బుల్డోజర్ల ద్వారా అక్రమ ఆస్తులను కూల్చివేసే చర్య ప్రొఫెషనల్ మాఫియా, నేరస్థులపై మాత్రమే చేయాలని, ఏ పేద గుడిసెపైనా బుల్డోజర్ పనిచేయకూడదని సీఎం యోగి కఠినమైన ఆదేశాలను జారీ చేశారు.పేదల ఆస్తులను ఆక్రమించే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.