అయోధ్య ఆశిస్సు.. యూపీ గెలుపు..!

రాజకీయ, సాంస్కృతిక వైవిధ్యాలకు నెలవు ఉత్తర ప్రదేశ్. గంగా, యమున, సరస్వతీ మహానదుల సంగమ క్షేత్రం ప్రయాగ – హైందవ సంస్కృతికి ప్రాణదీప్తి. సరస్వతీ విద్వత్తు, కాళింది తపస్సు, గంగోత్రి గరిమల త్రివేణీ సంగమం ఉత్తరాది ధార్మిక ప్రతిష్ఠకు చిహ్నం. కోసలాధీశుడి జన్మస్థానం అయోధ్యాపురి- రాజకీయ కోలాహలానికి నెలవు-అలహాబాదు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒక మఠాధీషుడు అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అరుదైన చరిత్ర కూడా యూపీకి మాత్రమే సొంతం.
1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల కాలం నుంచి నేటి వరకు ఉత్తర ప్రదేశ్ అనేక రాజకీయ సంచలనాలకు మాతృక. దేశ రాజకీయాలను మార్చిన ఘనత ఆ రాష్ట్రానికే దక్కుతుంది. బీజేపీ ఎదుగుదలను వేగవంతం చేసింది కూడా ఈ ఉత్తరాది రాష్ట్రమే!
దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీలో గెలుపు మరోసారి కమలం పార్టీని వరిస్తుందా? ఎస్పీ, బీఎస్పీల ఒంటరి పోరు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తుందా? మజ్లీస్ బరిలో దిగితే ఓట్ల చీలిక ఎవరికి అనుకూలిస్తుంది? సామాజిక వర్గాల పొందిక రాజకీయ వ్యూహంలో ఎలా భాగమవుతోంది? యోగి విషయంలో ప్రతిపక్షాల ప్రచారం నిజమా? అబద్ధమా? ఇలాంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దేశంలో మరో ఎన్నికల సీజన్ సమీపిస్తోంది. 2022లో ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజ రాత్, జమ్మూకశ్మీర్‌లలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీటన్నింటిలో యూపీ ఎన్నికలే కీలకం అంటారు నిపుణులు. ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతోంది.
మే నెలలో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు కమలం పార్టీని కాసింత కుంగదీశాయి. అధికారం కోల్పోయి-అవమాన భారాన్ని మోసుకు తిరుగుతున్న ఎస్పీ-బీఎస్పీలకు పంచాయితీ ఫలితాలు ఊరటనిచ్చాయి. ప్రస్తుతం యూపీలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. జూలై3తో ముగుస్తాయి. బీజేపీ, బీఎస్పీ, ఎస్పీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
దేశ రాజకీయాలను ప్రభావితం చేసే యూపీ అసెంబ్లీ ఎన్నికలు మరో తొమ్మిది మాసాల్లో జరగనున్నాయి. యోగీ ఆదిత్యానాథ్ ను ఓడించేందుకు రాజకీయ పునరేకీకరణ ఉధృతంగా జరుగుతోంది. మనదేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్-ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు భారత ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయని విశ్లేషకుల ఊవాచ.
1952 నుంచి 2017 వరకు యూపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ఐదేళ్ల కాలం పూర్తి చేసినవారు కేవలం ముగ్గురే ముగ్గురు. ఆ వరుసలో మొదట బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, 2017లో బీజేపీ తరపున గెలిచిన యోగీ ఆదిత్యానాథ్. సుదీర్ఘకాల అస్థిర రాజకీయాలకు, సామాజిక వర్గాల బలనిరూపణకు, ఘర్షణాత్మక వాతావరణానికి నిలయం ఉత్తర ప్రదేశ్. ఔన్నత్య ప్రతీక-పతన ప్రతిబింబం యూపీ.
సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్డీ ఇప్పటికే పొత్తుపట్ల అవగాహనకు వచ్చేశాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతులు ప్రత్యేకించి జాట్ రైతుల ఓట్లపై ఆర్ఎల్డీ కొత్త చీఫ్ జయంత్ చౌదరి ఆశలు పెట్టుకున్నారు. ఇక అఖిలేశ్ యాదవ్ 2017లో లాగా కాంగ్రెస్‌తో మళ్లీ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది.
ఒంటిరిగా బరిలోకి దిగుతానని బీఎస్పీ ప్రకటించింది. వంద స్థానాల్లో పోటీ చేస్తామని మజ్లీస్ పార్టీ తేల్చి చెప్పింది. 2017లో పార్టీ 38 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు గెలవలేదు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పార్టీకి 2,05,232 ఓట్లు పోలయ్యాయి.
ఇది మొత్తం ఓట్లలో 0.2 శాతం. ఇటీవలి పంచాయతీ ఎన్నికలలో పార్టీ గ్రాఫ్ పెరుగుదలను నమోదు చేసింది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తనకు ఎవరు ఎన్ని సీట్లు ఇవ్వగలరు అని వెతుకులాడుకునే స్థితిలో పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితంపై రాజకీయ పక్షాల భవితవ్యం ఆధారపడి ఉంది.
ఏ రెండు ఎన్నికల ఫలితాలనైనా పోల్చి అంతిమతీర్పును నిర్ధారించలేమంటుంది Social choice theory. బీజేపీ పంచాయితీ పోరులో ఓడిపోయింది కాబట్టి అసెబ్లీ ఫలితాల్లో అదే స్థితిని ఎదుర్కొంటుందనీ, ఎస్పీ, బీఎస్పీలు ప్రభావం చూపగలిగాయి కాబట్టి, రాబోయే ఎన్నికల్లో బీజేపీని నిలువరిస్తాయని కరాఖండిగా చెప్పలేం!
అనేక రాజకీయ పక్షాలు తలపడుతున్నచోట; ఒక పార్టీ గెలిచి… ఔరా అనిపించేలా పాలించడం అంత సునాయాసం కాదు. ప్రతిపక్షం మాటున కుట్రమూకలు, మందబలం చూపి బెదిరింపులకు దిగే పార్టీలు ఉన్నచోట, నేర సామ్రాజ్యానికి చిరునామాగా మారిన రాష్ట్రంలో పాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం ఆషామాషీ కాదు.
యూపీ రాజకీయ రణరంగంలో బీజేపీ పుంజుకుని తిరిగి లేచి నిలబడుతుందా లేదా అని నిర్ధారణ అయ్యేందుకు యూపీ ఎన్నికలు గీటురాయి కాబోతున్నాయి. అట్లా అని ఉత్తర ప్రదేశ్ ఫలితాలు మాత్రమే దేశ ప్రజల అభిప్రాయాన్ని అచ్చుగుద్దినట్టూ ప్రతిబింబిస్తాయని చెప్పలేం! అసంతృప్త వర్గాలకు చేరువయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది బీజేపీ అధిష్ఠానం. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జితిన్ ప్రసాద కాషాయ కండువా కప్పుకోవడం యూపీ భాజపాలో ఉత్సాహాన్ని నింపింది.
ఈ చేరికతో చాన్నాళ్ల నుంచి అసంతృప్తిగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం మళ్లీ పార్టీకి దగ్గరవుతుందన్న భరోసా బీజేపీ నేతల్లో కనిపించింది. అప్నాదళ్-ఎస్, నిషాద్ పార్టీలను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ పార్టీల నేతలు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. నిజానికి ఈ రెండు పార్టీలు బీజేపీతో కలిసి పోటీ చేసినవే. గత కొంతకాలంగా మిత్రపక్షాలు అసంతృప్తిగా ఉన్నాయనే వార్తలు వెలువడుతున్నాయి.
యూపీలో యాదవుల తర్వాత అత్యంత బలమైన ఓటు బ్యాంకు కుర్మి సామాజిక వర్గానికి ఉంది. ఆ వర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్.. గతం లో మోదీ మంత్రివర్గంలో పనిచేశారు. రెండో సారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు చోటు దక్కలేదు. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ అనుప్రియా పటేల్‌కు మంత్రివర్గంలో చోటిస్తారన్న ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. జిల్లా పరిషత్ ఎన్నికల్లో అప్నాదళ్-బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి.
మత్స్యకార వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నిషాద్ పార్టీ కూడా మంత్రివర్గంలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేయడం మూలంగానే ప్రతిష్ఠంభన ఏర్పడిందనే వాదనలూ ఉన్నాయి.
మత్స్యకారులను వెనుకబడిన కులాల జాబితాలో కాకుండా షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని ఆ పార్టీ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. అది నెరవేరుతుందో లేదో తెలియదు గానీ ఆ పార్టీ నాయకుడు సంజయ్ నిషాద్ మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు సిద్ధమని సంకేతాలు పంపినట్టూ వార్తలు వెలువడుతున్నాయి.
రాజభర్ సామాజిక వర్గాన్ని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్న సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీని కూడా తనవైపు తిప్పుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. చిన్న పార్టీలను గౌరవించిన చరిత్ర బీజేపీకి ఉంది. యూపీలోనే కాదు.. బిహార్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో కూడా చిన్నపార్టీలతో పొత్తు పెట్టుకుని అనుకున్న లక్ష్యాలు సాధించింది కమలం పార్టీ. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన యూపీపై పట్టును ఎట్టిపరిస్థితుల్లో కోల్పోకూడదని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో చిన్న పార్టీలతో సయోధ్య కీలకమని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.
ప్రధానంగా గత ఎన్నికల్లో పార్టీ కోల్పోయిన 84 అసెంబ్లీ స్థానాలపై బీజేపీ నేతలు ప్రత్యేక దృష్టిసారించారు. అక్కడ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించుకుని…వచ్చే ఎన్నికల్లో అక్కడ విజయం సాధించేందుకు పక్కా ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు. అక్కడ పార్టీ ఓటమికి ఒకటికంటే మించిన కారణాలున్నట్లు ఆ పార్టీ భావిస్తోంది.
పార్టీ ఓటమి చెందిన స్థానాల్లో ఆరు మాసాల మునుపటి నుంచే కమలనాథులు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. బలహీన జోన్స్‌ను గుర్తించి…అక్కడ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలను స్థానిక సీనియర్ నేతలకు అప్పగించారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. నియోజకవర్గ ప్రజలతో పార్టీ మమేకమయ్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పొత్తులతో సంబంధం లేకుండా అన్ని బలహీన నియోజకవర్గాల్లో బలపడటమే లక్ష్యంగా బీజేపీ నేతలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో చేతులు కలిపి.. 10సీట్లు గెలుచుకున్న బీఎస్పీ.. ఆ తర్వాత 11 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 3,050 జిల్లా పంచాయత్ సీట్లలోఎస్పీకి 782, బీజేపీకి 580 సీట్లు రాగా.. బీఎస్పీకి 336 సీట్లు లభించాయి. ఒక్క బుందేల్ ఖండ్ లో మాత్రమే మాయావతి అత్యధిక ప్రభా వం చూపగా.. మిగతా ప్రాంతాల్లో పెద్ద గా ఆకట్టులేకపోయారు.
నిజానికి 2017 అసెంబ్లీ ఎన్నికల వర కూ ఎస్పీ, బీఎస్పీ దాదాపు సమాన బలా న్ని ప్రదర్శించాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 39.7 శాతం ఓట్లతో 312 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా.. ఎస్పీ, బీఎస్పీలకు దాదాపు 22 శా తం చొప్పున ఓట్లు వచ్చినప్పటికీ.. ఎస్పీకి 47 సీట్లు.. బీఎస్పీకి 19 సీట్లే లభించాయి.
దీంతో ఇద్దరం చేతులు కలిపితే ఫలితం ఉండొచ్చన్న ఉద్దేశంతో.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ పొత్తు పెట్టుకున్నాయి. ఎస్పీ ఓట్లు బీఎస్పీకి బదిలీ అయినప్పటికీ.. బీఎస్పీ ఓట్లు ఎస్పీ బదిలీ కాలేదని వివిధ సర్వేల్లో తేలింది. వివిధ సందర్భాల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ సహా అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్న మాయావతిని ఈ ఎన్నికల్లో ఎవరూ విశ్వసించే అవకాశాలు కనపడడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ప్రధాన పార్టీలేవీ తనతో జట్టుకట్టేందుకు సిద్ధపడకపోవడంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తన ఓట్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేయవచ్చని రాజకీయ వర్గాలు భావించాయి. అయితే బీఎస్పీ ఎంఐఎంతో పొత్తు ప్రసక్తే లేదని చెప్పడంతో ఉత్కంఠకు తెరలేచింది.
మజ్లీస్ వంద స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి.. బీజేపీకే ఎక్కువ లాభం చేకూరుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యూహాన్ని దెబ్బతీసేందుకు సమాజ్‌వాది పార్టీ.. రాష్ట్రీయ లోక్‌దళ్-ఆర్ఎల్డీ, కాంగ్రెస్, సుహుల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, అంబేడ్కర్ సమాజ్ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి.
బుందేల్ ఖండ్, రోహిల్ ఖండ్, అప్పర్ దోఆబ్ లలో బీజేపీ తన పట్టును కోల్పోలేదు. అవధ్, లోయర్ దోఆబ్, పూర్వంచల్ ప్రాంతాల్లో ఎస్పీ – బీజేపీల మధ్య పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. బుందేల్ ఖండ్, అప్పర్ దోఆబ్ ప్రాంతాల్లో బీఎస్పీ కొంత ప్రభావం చూపే ఛాన్స్ ఉందంటారు పరిశీలకులు. సమీకరణలు, ఎన్నికల గణాంకాలు ఎలా ఉన్నా, యూపీ ఎన్నికల్లో జయాపజయాలు రానున్న కాలంలో దేశవ్యాప్త రాజకీయ వాతావరణాన్ని నిర్దేశిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.