చైనా కోరలు పీకేలా తైవాన్ తో అమెరికా కోస్ట్ గార్డ్ డీల్

0
742

దక్షిణ చైనా సముద్రంలో రాకాసి అలల్లా ఎగసిపడుతున్న.. డ్రాగన్ కోరలు పీకేందుకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జపాన్, భారత్, ఆస్ట్రేలియాతో కలిసి క్వాడ్ కూటమిలో భాగస్వామిగా మారి చైనా ముందరికాళ్లకు బంధం వేసింది. అంతేకాదు, బీజింగ్ పెత్తనానికి చెక్ పెట్టేందుకు మరిన్ని కఠిన చర్యలు ప్రారంభించింది. తైవాన్‌తో కయ్యానికి కాలుదువ్వుతూ దక్షిణ చైనా సముద్రం, పసిఫిక్ తీరంలో ఆధిపత్యాన్ని పెంచుకుంటున్న చైనా విషయంలో దూకుడుగానే వెళ్తోంది. ఈ నేపథ్యంలో తీర రక్షణ దళాలను మరింత బలోపేతం కోసం తైవాన్‌తో అమెరికా ఒప్పందం చేసుకుంది.

ఒప్పందంలో భాగంగా తీర రక్షణ దళాల మధ్య పరస్పర సహకారం, సమాచార మార్పిడి కోసం ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై తైవాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ ఒప్పందంపై స్పందించిన తైవాన్ ప్రధాని సు షెంగ్ షాంగ్.. విదేశీ నౌకలు కనిపిస్తే కాల్చివేసేలా తీర రక్షణ దళాలకు జనవరిలో చైనా ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు. చైనా నిర్ణయం పొరుగుదేశాలను షాక్‌కు గురిచేసిందని, శాంతి, స్థిరత్వం కోసం పరస్పర విలువలతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

వివాదాస్పద జలాల్లో మిత్ర దేశాలకు సహకారం అందజేయడం కోసం పశ్చిమ పసిఫిక్‌లో కోస్ట్‌గార్డ్‌లను అమెరికా మోహరిస్తోంది. ఇందులో భాగంగానే తైవాన్‌తో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తైవాన్ సముద్ర జలాల్లో అమెరికా తన నౌకలను మోహరిస్తుందా..? లేదా..? అన్నదానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. అటు, తైవాన్ తమ భూభాగానికి చెందినదేనంటూ చైనా ఆక్రమణ వాదనలకు తెరతీసింది. ఎలాగైనా తైవాన్‌ను దారిలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల యుద్ధ విమానాలను పంపింది. అంతేకాదు, చేపలు పట్టేందుకు వాడే మర పడవలను దక్షిణ చైనా సముద్రంలో తైవాన్‌పైకి ఉసిగొల్పింది. చైనా చర్యలను అమెరికా తీవ్రంగా ఖండించింది.

ఇక, తైవాన్ ఒప్పందంతో అమెరికాపై చైనా మరింత రగిలిపోయే అవకాశం ఉంది. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. తైవాన్ విషయంలో ఆయన అమెరికాను పరోక్షంగా హెచ్చరించారు. తైవాన్‌పై సార్వభౌమాధికారానికి తమ వాదనలో ఏమాత్రం రాజీకి తావులేదని స్పష్టం చేశారు. తైవాన్ సమీప ప్రధాన భూభాగమైన ఫుజియాన్ సమీపంలో ద్వీపాలకు వందలాది డ్రెడ్జర్స్‌ను చైనా పంపగా.. తైవాన్ కోస్ట్‌‌గార్డ్ దళాలు వాటిని స్వాధీనం చేసుకున్నాయి. అక్రమ చేపల వేటను కూడా తైవాన్ ప్రాదేశిక జలాల్లో చైనా ప్రోత్సహిస్తోంది. ఇటీవల చైనా పడవ, 13 మంది క్యాబిన్ క్రూ సిబ్బందిని ఉత్తర తీరాన ఉన్న కీలంగ్ నగరం వద్ద పట్టుబడ్డారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

15 + nineteen =