అమెరికాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ ఇటీవల కరోనా బారినపడ్డారు. కోవిడ్ టెస్టులో ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఆమెకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. డెలావర్ లోని రెహోబోత్ బీచ్ ప్రాంతంలోని నివాసంలో ఆమె ఉన్నారు. ఏడాది క్రితం కూడా ఆమె కరోనా బారిన పడింది. ఇక 80 ఏళ్ల జో బైడెన్ కు కూడా కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అయితే ఆయనకు నెగెటివ్ అని తేలింది. జిల్ బైడెన్ కు కోవిడ్ సోకిన కారణంగా జో బైడెన్ కు రెగ్యులర్ గా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తారని, కరోనా లక్షణాలను పరిశీలిస్తారని వైట్ హౌస్ తెలిపింది.
జిల్ బైడెన్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అవ్వడంతో జో బైడెన్ జీ20 సదస్సు కోసం భారత్ కు వస్తారో లేదో అనే అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ షెడ్యూల్ ప్రకారం భారత్‌కు రానున్నట్లు వైట్ హౌస్ స్పష్టం చేసింది. సోమ, మంగళవారం చేసిన కొవిడ్ పరీక్షల్లో బైడెన్ కు నెగిటివ్ వచ్చిందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ తెలిపారు. గురువారం నాడు ఆయన ఢిల్లీ బయలుదేరుతారని, శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారని అమెరికా తెలిపింది. కొవిడ్-19 మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయన సమావేశాలకు హాజరవుతారని వైట్‌హౌస్ తెలిపింది. సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో బైడెన్ పాల్గొంటారని అమెరికా తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉందని.. జీ-20 పట్ల అమెరికా నిబద్ధత ఏ మాత్రం తగ్గలేదని జో బైడెన్ తెలిపారు. జీ 20 సమావేశాల తర్వాత బైడెన్ వియత్నాం పర్యటనకు వెళ్లనున్నారు.
72 ఏళ్ల జిల్ బైడెన్‌కు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటారని అధికారులు తెలిపారు. గత శనివారం ఫ్లోరిడాలోని హరికేన్ ఐడాలియా ప్రభావిత ప్రాంతాల్లో బైడెన్ దంపతులు కలిసి పర్యటించారు. తర్వాత డెలావెర్‌లోని బీచ్ హౌస్‌కు వెళ్లారు. అక్కడి నుంచి బైడెన్ ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. అయితే జిల్ బైడెన్ అక్కడే ఉండిపోయారు.