More

  చైనా, పాక్ మైత్రిపై రాహుల్ కామెంట్స్ కు అమెరికా కౌంటర్

  చైనా, పాకిస్తాన్ మైత్రి గురించి ప్రపంచం మొత్తం తెలుసు. భారత్ ను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఉగ్రవాదాన్ని దేశాన్ని చైనా పెంచి పోషిస్తోందని కూడా అందరికి తెలుసు. అలాంటి ఆ రెండు దేశాల స్నేహానికి కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా కామెంట్ చేయడం పెను దుమారం రేపుతోంది. భారత విదేశాంగ విధానంపై ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా సైతం స్పందించింది. ఆ వ్యాఖ్యలను తాము సమర్థించలేమంటూ ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ స్ఫష్టం చేశారు.

  పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. చైనా, పాకిస్థాన్‌ చేతులు కలపకుండా వేర్వేరు ఉంచాలన్నది భారత్‌ ఏకైక అతిపెద్ద వ్యూహమన్నారు. అయితే ప్రధాని మోదీనే ఆ రెండు దేశాలూ కలిసేలా చేశారని ఆరోపించారు. ఇదే మోదీ చేసిన అతిపెద్ద నేరమని రాహుల్ గాంధీ అన్నారు.

  అయితే రాహుల్‌ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ను మీడియా ప్రశ్నించగా.. పాకిస్థాన్‌, పీఆర్‌సీ మధ్య బంధం గురించి ఆ రెండు దేశాలకే వదిలేస్తున్నామని అమెరికా స్పష్టం చేసింది. అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మాత్రం ఖచ్చితంగా సమర్థించలేమని కూడా వెల్లడించింది. అంతేగాక, పాకిస్థాన్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని.., ఇస్లామాబాద్‌తో తమకు కీలకమైన బంధం ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ చెప్పడం కూడా సంచలనంగా మారింది.

  ఇక గణతంత్ర దినోత్సవాలకు ఒక్క విదేశీ అతిథినీ ఎందుకు తీసుకురాలేకపోయారని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అయితే దేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలోనే విదేశీ అతిథిని ఆహ్వానించలేకపోయామని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. మరోవైపు అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ నేడు ఒంటరిగా మిగిలిపోయిందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ మొన్నటికి మొన్న మధ్య ఆసియా దేశాధినేతలతో ప్రధాని మోదీ వర్చవల్ సమావేశాన్ని సైతం నిర్వహించారు. ఇంకా బాహ్యశక్తుల నుంచి దేశానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని కూడా రాహుల్ అన్నారు. ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భారత్ కు ఎప్పుడు ఉ్రగవాద దేశమైన పాకిస్తాన్ నుంచి ముప్పు ఉంటూనే ఉంటది. అలాగే భారత్ ను అన్ని విధాలుగా దెబ్బ కొట్టాలని చూసే చైనా నుంచి సరిహద్దు సమస్య ఉంది. ఇవన్నీ తెలిసి కూడా రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు పార్లమెంట్ సాక్షిగా చేయడం ఏంటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై లోక్‌సభలో రాహుల్ గాంధీ కేంద్రంపై చేసిన పలు విమర్శలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తిప్పికొట్టారు. రాహుల్ గందరగోళం మనిషని., మతిలేని నేత అంటూ విమర్శించారు. ఇండియా ఒక దేశం కాదని రాహుల్ అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా విజన్ చాలా స్పష్టంగా ఉందని రాహుల్ గాంధీ కొనియాడటంపై మండిపడ్డారు. చైనాను సపోర్టు చేసేందుకు రాహుల్ ఇక్కడకు వచ్చారా అని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. అసలు టిబెట్ సమస్యకు కారణం కాంగ్రెస్సే అంటూ విమర్శించారు. ప్రధాని మోదీని ‘కింగ్’ అంటూ రాహుల్ ఎద్దేవ చేయడంపై కూడా ప్లహ్లాద్ జోషి స్పందించారు. గాంధీ కుటుంబం నుంచి వచ్చినందువల్లే రాహుల్‌కు మాట్లాడే అవకాశం వచ్చిందని ప్రహ్లాద్ జోషి గుర్తు చేశారు.

  Trending Stories

  Related Stories