More

    ఆ ఆయుధాలు తాలిబాన్ల చేతుల్లోకి.. అక్కడి నుండి పాకిస్తాన్.. ఆ తర్వాత..!

    ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి అమెరికా అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఇన్ని సంవత్సరాలు సప్లై చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో తాలిబాన్ల చేతుల్లోకి అమెరికా ఇచ్చిన ఆయుధాలు కూడా వెళ్లిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ బలగాలను ఉపసంహరించుకున్న తరువాత, రాజధాని కాబూల్‌తో సహా చాలా ప్రావిన్సులను ఐఎస్ఐ మద్దతు ఉన్న తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో అరాచక శక్తులు ప్రస్తుతం రాజ్యమేలుతూ ఉన్నాయి. యుద్ధంతో దెబ్బతిన్న దేశం నుండి నాటో దళాలు వైదొలగడం మరియు యుఎస్ సైనికులు నిష్క్రమించడంతో, వారు వదిలిపెట్టిన పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైనిక పరికరాలు ఇప్పుడు తాలిబాన్ నియంత్రణలో ఉన్నాయి.

    ఈ ఆయుధాలు త్వరలో పాకిస్తాన్‌లోకి, ఆపై పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదుల ద్వారా భారతదేశానికి చేరుకుంటాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌ లోకి పాక్ నుండి చొరబడే తీవ్రవాదుల చేతుల్లోకి ఈ ఆయుధాలు చేరే అవకాశం ఉందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆయుధాలను మొదట పాకిస్తాన్‌లో ఐఎస్‌ఐ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపులు ఉపయోగిస్తాయని, ఆపై భారత్‌లోకి ప్రవేశిస్తాయని సైనిక నిపుణులు తెలిపారు.

    “అమెరికాకు చెందిన ఆయుధాలు, ముఖ్యంగా చిన్న ఆయుధాలు పాకిస్తాన్‌కు పంపబడుతున్నాయని ఇప్పటికే సమాచారం ఉంది. తాలిబాన్ల విజయం తర్వాత టెర్రర్ గ్రూపులు ధైర్యంగా ఉండడంతో.. పాకిస్తాన్‌లోనే ఈ ఆయుధాలను హింస కోసం ఉపయోగించబడే అవకాశం ఉంది” అని సీనియర్ సైనికాధికారులు ఏఎన్ఐ కి చెప్పారు. ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రితో పాటు, అమెరికన్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, నైట్ విజన్ పరికరాలు చాలా వరకూ పాకిస్తాన్ సైన్యంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఏఎన్ఐ తెలిపింది.

    గత 20 సంవత్సరాలలో అమెరికన్ దళాలు ఆఫ్ఘన్ దళాలకు 6.5 లక్షలకు పైగా చిన్న తుపాకులను అందించాయి. వీటిలో M-16 మరియు M-4 అస్సాల్ట్ రైఫిల్స్ కూడా ఉన్నాయి. అలాగే పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని సరఫరా చేసింది. 2001 నుంచి ఆఫ్ఘన్ భద్రతా దళాలకు అమెరికా 83 బిలియన్ డాలర్ల విలువైన శిక్షణ మరియు రక్షణ సామగ్రిని అందించిందని ఫోర్బ్స్ నివేదిక సూచించింది. ఈ ఏడాదే ఆఫ్ఘన్ దళాలకు అమెరికా మూడు బిలియన్ డాలర్ల సైనిక సహాయం చేసింది.

    అమెరికాకు చెందిన ఆయుధాలతో తాలిబాన్లు:

    అమెరికాకు చెందిన ఆయుధాలతో తాలిబాన్లు ఉన్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని వస్తున్న సమయంలో అమెరికా వదిలిపెట్టిన బిలియన్ డాలర్ల విలువైన ఆధునిక సైనిక ఆయుధాలను జీహాదీ సంస్థ స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. అమెరికా వదిలివెళ్లిన యుద్ధ విమానాల దగ్గర తాలిబాన్లు ఉండడం. యుఎస్ సరఫరా చేసిన M24 స్నిపర్ రైఫిల్స్, M18 అస్సాల్ట్ ఆయుధాలు, ఇతర చిన్న ఆయుధాలు, హమ్‌వీస్, అమెరికా తయారు చేసిన మిలిటరీ ట్రక్కులు తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళిపోయిన వీడియోలను చూడొచ్చు.

    ఎవరిని ఎదుర్కోడానికైనా భారత్ సిద్ధమే:

    అత్యున్నత ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ పాకిస్తాన్ పంపే తీవ్రవాదులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భారత సైనిక అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు అత్యున్నత ఆయుధాలు, మనుగడ పరికరాలు ఇచ్చినా వాటిని ఎదుర్కోవడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ స్పష్టం చేసింది. భారతదేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ సైన్యం తాలిబాన్లను ఉపయోగించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే వారిని భారత భద్రతా బలగాలు అడ్డుకోగలవని భారత సైన్యం స్పష్టం చేసింది.

    Trending Stories

    Related Stories