అమెరికా.. అగ్ర రాజ్యమైనప్పటికీ గన్ కల్చర్ అనే వ్యాధితో ఎన్నో ఏళ్లుగా బాధపడుతూనే ఉంది. ఎందరు పాలకులు మారినా సూపర్ మార్కెట్లలో గన్స్ దొరికే స్థితిలోనే ఉంది. తాజాగా అమెరికా లోని టెక్సాస్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతిచెందారు. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డేలోని ఈ పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. మృతిచెందిన విద్యార్థుల వయస్సు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. అనుమానితుడు ఉవాల్డే హైస్కూల్‌లో 18 ఏళ్ల విద్యార్థి కాగా.. పోలీసులు అతన్ని చంపేశారు. నిందితుడిని సాల్వడోర్ రామోస్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనకు ముందు.. తన బామ్మను చంపిన తర్వాత వాహనంలో స్కూల్‌కు చేరుకుని ఘాతుకానికి పాల్పడ్డాడు. చిన్న పిల్లల క్లాస్ రూమ్స్ లోకి చొరబడ్డ అతడు 18 మంది పిల్లలను చంపాడు. మరణించినవారిలో ముగ్గురు పెద్దలు కూడా ఉన్నారు. దాదాపు ఒక దశాబ్దం క్రితం కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లోని శాండీ హుక్ ఎలిమెంటరీలో ఒక వ్యక్తి 20 మంది పిల్లలను, ఆరుగురు పెద్దలను హతమార్చిన ఘటన తర్వాత అమెరికా పాఠశాలలో జరిగిన అత్యంత ఘోరమైన కాల్పుల ఘటనలో ఒకటిగా ఇది నిలిచింది.
ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేవుడి దయతో దేశంలో తుపాకీ సంస్కృతి ఎప్పుడు అంతమవుతుందో! మనం గన్ లాబీకి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాడుతామో! అని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు కలచి వేస్తున్నాయని, వాటిని చూసి చూసి అలసిపోయానని అన్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచంలో ఇలాంటి ఘటనలు జరగడం అరుదని, అమెరికాలో మాత్రం ఎందుకు తరచూ జరుగుతున్నాయోనని బైడెన్ విచారం వ్యక్తం చేశారు. ఐదు రోజుల ఆసియా పర్యటనను ముగించుకుని అమెరికాకు ఆయన చేరిన కాసేపటికే కాల్పుల ఘటన చోటు చేసుకుంది.