అధికారంలో ఉన్నన్ని రోజులు చైనాకు చుక్కలు చూపించాడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆంక్షలమీద ఆంక్షలు విధిస్తూ ప్రత్యక్ష నరకాన్ని పరిచయం చేశాడు. కరోనా వైరస్ చైనాలో పుట్టింది కాబట్టి.. దాన్ని చైనా వైరస్ గా ప్రచారం చేసి ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో ట్రంప్ పై పీకల్దాకా కోపం పెంచుకున్న జిన్ పింగ్.. ఈయన పీడ ఎప్పుడు విరగడవుతుందిరా బాబూ అని.. కోరుకోని క్షణం లేదు. సరైన అవకాశం కోసం ఎదురుచూసింది. ఇంతలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు రానేవచ్చాయి. దీంతో ట్రంప్ సర్కార్ కు చెక్ పెట్టేందుకు ఇదే ఛాన్స్ అని భావించింది చైనా. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు.. అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయానికి బాహాటంగానే మద్దతు పలికింది. అటు, ఎన్నికలకు ముుందు బైడెన్ కూడా చైనా పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించారు. బైడెన్ గెలుపు వెనుక చైనా హస్తం వుందని.. అప్పట్లో ట్రంప్ వర్గం కూడా విమర్శలు గుప్పించింది.
సీన్ కట్ చేస్తే.. ఎన్నికలు పూర్తయ్యాయి, బైడెన్ అధికారాన్ని చేపట్టాడు. ఇంతవరకు బాగానేవుంది. తనకు మిత్రుడిగా వుంటాడనుకున్న కొత్త అధ్యక్షుడు.. ట్రంప్ దారిలోనే చైనాకు చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు. చెప్పాలంటే, డ్రాగన్ తో ఆటాడుకోవడంలో బైడెన్ సర్కార్ ట్రంప్ ను మించిపోతోంది. అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కింది మన మిత్రుడే కదా అని చంకలు గుద్దుకున్న జిత్తులమారికి.. ఇప్పుడు అసలైన తెల్లతోలు పైత్యం రుచి తెలుస్తోంది. చైనాకు నొప్పితెలియకుండా, మెల్లమెల్లగా, వేరీ డిప్లొమేటిక్ గా దెబ్బకొడుతోంది బైడెన్ సర్కార్.
ఓవైపు దక్షిణ చైనా సముద్రంలో ఆగడాలు, మరోవైపు ఉయ్ గుర్ ముస్లింల విషయంలో మానవహక్కుల ఉల్లంఘన, కరోనా వైరస్ విషయంలో దాగుడుమూతలు.. ఇలా చైనా ప్రదర్శిస్తున్న పైత్యానికి బైడెన్ ప్రభుత్వం కూడా ఘాటుగానే రిప్లై ఇస్తోంది. డ్రాగన్ తో ఎంత ప్రమాదమో ప్రపంచ దేశాలకు మరింత క్లియర్ గా చెబుతోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్ ను బ్రహ్మాస్త్రంగా మలుచుకుంది. వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది. అన్ని దేశాలు మూకుమ్మడిగా వింటర్ ఒలింపిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలని కోరింది.
డిప్లొమేటిక్ బాయ్‌కాట్ చేయడం ద్వారా చైనా తీరును వ్యతిరేకించాలని యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ పిలుపునిచ్చారు. చైనా నిర్వహించే వింటర్ ఒలిపింక్స్‌కు అన్ని దేశాలు హాజరైతే.. ఆ దేశంలో అన్నీ సవ్యంగానే ఉందనే సంకేతాలను ఇచ్చినట్టవుతుందని, ఇది ఎంత మాత్రం సరికాదని పెలోసి తెలిపారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని గుర్తు చేశారు. వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అథ్లెట్లకు అభ్యంతరం చెప్పని దేశాలు.. ప్రభుత్వ తరఫు అధికారులు, రాయబారులు, హైకమిషనర్లను గానీ ఆ మెగా ఈవెంట్‌కు పంపించకూడదని ఆమె సూచించారు. వింటర్ ఒలింపిక్స్‌కు హాజరయ్యే దేశాలు.. భవిష్యత్తులో మానవ హక్కుల గురించి మాట్లాడే అర్హతను కోల్పోయినట్టవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
షెడ్యూల్ ప్రకారం.. వింటర్ ఒలింపిక్స్ వచ్చే ఏడాది చైనాలో నిర్వహించాల్సి ఉంది. ఫిబ్రవరి 4వ తేదీన ఇది ఆరంభం కావాల్సి ఉంది. రాజధాని బీజింగ్ దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. కరోనా వైరస్ తీవ్రత దాదాపు తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో చైనా.. వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేపట్టింది. అయితే, అమెరికా టార్గెట్ చేయడంతో దిక్కుతోచని స్థితిలో చిక్కుకుంది చైనా. ఒకవేళ నాన్సీ ఇచ్చిన డిప్లొమేటిక్ బైకాట్ పిలుపును మిగతా దేశాలు కూడా సీరియస్ గా తీసుకుంటే.. వింటర్ ఒలింపిక్స్ ను చైనా నిర్వహించడం అసాధ్యం. వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించడం ద్వారా ప్రపంచ దేశాలన్నీ చైనాను వ్యతిరేకిస్తున్నాయనే విషయాన్ని బలంగా చాటిచెప్పినట్టవుతుందని అమెరికా భావిస్తోంది. అదే జరిగితే, పశ్చమ దేశాలతో వున్న చైనా శతృత్వం మరింత బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.