ప్రజాస్వామ్యం, వాక్స్వాతంత్ర్యం పేరుతో పశ్చిమ దేశాలు వివిధ భారత వేర్పాటువాద తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయి. మోస్ట్ వాంటెడ్ ఖాలిస్తాన్ టెర్రరిస్టుల్లో ఒకడైన గురుపట్వంత్ సింగ్ పన్ను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. కెనడా, జర్మనీ, యూఎస్, యూకే వంటి అనేక దేశాలు ఇలాంటి వేర్పాటువాద నాయకులకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, కశ్మీర్ గురించి విష ప్రచారం చేసేవాళ్ళకి సహాయం చేస్తున్నాయి. కశ్మీర్‌పై జర్మనీ విదేశాంగ మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో వేర్పాటువాద ఉద్యమాలకు పశ్చిమ దేశాలు ఎలా ఆజ్యం పోస్తున్నాయో మరోసారి రుజువు చేశాయి. దీనిపై భారత్ అనేకసార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, పశ్చిమ దేశాలు భారత వేర్పాటువాదులపై ఎటువంటి చర్య తీసుకోలేదు. అయితే, కుట్రపూరితంగానే వారిపై చర్యలు తీసుకోవడం లేదనేది వాస్తవం. ఈ వేర్పాటువాదులు ప్రపంచ వేదికపై భారత ప్రభుత్వాన్ని అవమానిస్తున్నారు. అంతే కాదు, వీళ్ళు భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్నారు.
భారత్ క్రమక్రమంగా ఎదుగుతూ వస్తుందనేది కాదనలేని సత్యం. ఎక్కడ తమ అధిపత్యనికి భారత్ ఎసరుపెడుతుందోనని.. ఈ రకమైన ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నారు. దీనిద్వారా భారత్ ఎప్పుడు ఏదో ఒక సమస్యతో నలుగుతూ ఉండడం వలన అభివృద్ధికి ఆటంకం కలగడమే కాకుండా.. తమ స్థానం కూడా పదిలంగా ఉంటుందనేది ఈ పశ్చిమ దేశాల దుర్మార్గపు ఆలోచన. చైనా ఎదగడంలో కీలక పాత్ర వహించిన పశ్చిమ దేశాలు. ఇప్పుడు దానిని ఎదురుకోవడంలో కింద మీద పడుతున్నాయి. అసలే చైనా లాంటి దేశం ఎదుగుదలలో సహాయపడి తప్పు చేశామనే భావనలో ఉన్న పశ్చిమ దేశాలు.. భారత్ విషయంలో మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాయి. అందుకే చైనాను నీయంత్రించడానికి ఒకవైపు భారత్‌తో సంబంధాలను బలపర్చుకుంటూనే.. మరోవైపు పాకిస్థాన్ తో పాటు.. మన దేశంలోని అంతర్గత విచ్చిన శక్తుల ద్వారా భారత్ ను ఇబ్బంది పెడుతున్నాయి.
అయితే, భారత్ ఈ అవాంతరాలను అధిగమించి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకెళ్తోంది. ఇదే సమయంలో భారత్‌లో వేర్పాటు ఉద్యమాలకు ఆజ్యం పోస్తున్న ఈ పాశ్చాత్య దేశాలకు ఒక గుణపాఠం నేర్పించడం గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. కానీ, ఎలా..? అమెరికా లాంటి సూపర్ పవర్ ని ఢీ కొనే శక్తి భారత్ కు ఉందా..? అంటే లేదనేది సత్యం. మరి, అగ్రరాజ్యాల ఆగడాలను ఎదిరించి నిలువరించే మార్గమే లేదా..? దీనికో మార్గం ఉంది. యూఎస్, జర్మనీల్లో స్వాతంత్ర్యం కావాలని కోరుకునే కొన్ని ప్రాంతాలు ఉన్నాయని మీకు తెలుసా..? పాశ్చాత్య మీడియా ఈ సమస్యపై దృష్టిపెట్టని కారణంగా.. ఈ విషయం చాలామందికి ఇది తెలిసుండదు. దానర్ధం అలాంటి ఉద్యమాలు లేవని కాదు. ఉన్నాయి. అవేంటో, వాటి వల్ల ఆ దేశాలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, భారత్ వీటిని ఎలా తనకు అనుకూలంగా మలుచుకోగలదో ఈ వీడియొలో తెలుసుకుందాం.
ముందుగా అమెరికాతో ప్రారంభిద్దాం. సుమారు మూడు దశాబ్దాలుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే అగ్రరాజ్యంగా ఉంది. అయితే దాని ప్రాభవం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయినా ఇప్పటికీ పాశ్చాత్య మీడియాపై బలమైన పట్టును కలిగి ఉంది. అందుకే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లాగా వేర్పాటు ఉద్యమం ప్రజలను ఆకర్షించకపోవచ్చు. దీనికి ప్రచారం కల్పించాలి. అమెరికాలో ఏ రాష్ట్రం వేరుపడాలని కోరుకుంటుందో మీకు తెలుసా..? టెక్సాస్..! ఎస్.. టెక్సాస్ వేర్పాటుకు రిపబ్లికన్ చట్టసభ సభ్యుడు టెడ్ క్రూజ్ కూడా మద్దతు పలికాడు. ఇది మాత్రమే కాదు, 2021లో వేర్పాటు బిల్లును టేబుల్‌పైకి తెచ్చారు, కానీ అది నిలబడలేదు. అంత మాత్రాన ఈ వేర్పాటు వాదులు నిరాశపడలేదు. రిపబ్లికన్ పార్టీ అనుబంధ సంస్థ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ టెక్సాస్, యునైటెడ్ స్టేట్స్ నుండి టెక్సాస్‌ను వేరు చేయడానికి 2023లో ప్రజాభిప్రాయ సేకరణను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. చరిత్రలోకి వెళ్తే టెక్సాస్ 1845లో విలీనమయ్యే ముందు సార్వభౌమ రాజ్యంగా ఉండేది.
టెక్సాస్ మాత్రమే కాదు, అమెరికా నుండి అనేక మంది పౌరులు తమ రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ నుండి విడిపోవాలని కోరుకుంటున్నారు. 2022 మధ్యంతర ఎన్నికలకు ముందు అమెరికాలో వేర్పాటువాదం ఊపందుకోవచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో గతేడాది నిర్వహించిన సర్వేలో 37 శాతం మంది ప్రతివాదులు యూఎస్ నుంచి వేరు పడటానికి సుముఖత వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ వేర్పాటువాదానికి యూఎస్‌లోని దక్షిణాది రాష్ట్రాల్లో మద్దతు ఎక్కువగా లభిస్తోందని సర్వే పేర్కొంది.
విభజన స్వరం ఇప్పటికీ మైనారిటీలో ఉన్నందున, అది పెద్దగా వెలుగులోకి రావడం లేదు. అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా, ఇటువంటి ఉద్యమాలు వివిధ రాష్ట్రాలకు వ్యాపించి, చట్టసభల నుండి మద్దతు పొందినట్లయితే, అప్పుడు అమెరికా మౌనంగా ఉండటం సమస్య అవుతుంది. అసలే అమెరికాలో చిన్న చిన్న విషయాలకి రోడ్డు మీదకి వచ్చే అక్కడి జనాలు, ఇలాంటివి మెదడులోకి వెళ్ళి ఉద్యమాలు చేపడితే ఎలా ఉంటుందో వేరే చెప్పకర్లేదు.
ఇప్పుడు జర్మనీ దగ్గరికి వద్దాం, యూరోపియన్ పవర్‌హౌస్ అయిన జర్మని శాంతియుత పరిష్కారం కోసం భారత్, పాకిస్తాన్ మధ్య శాంతియుత చర్చలు జరగాలని నీతి సూక్తులు వల్లించింది. అక్కడితో ఆగకుండా.. మరో అడుగు ముందుకేసిన జర్మనీ ఈ శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తుందని కూడా సెలవిచ్చింది. కశ్మీర్ విషయం 1948లో ఐక్యరాజ్యసమితికి వెళ్లింది కాబట్టి, ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించడం తప్ప భారతదేశానికి వేరే మార్గం లేదు. వాస్తవానికి, జర్మనీ ప్రకటనకు సంబంధించి భారత్ ఇప్పటికే బలమైన కౌంటర్ ఇచ్చింది.
అయితే మనం మాట్లాడదలుచుకున్నది అది కాదు. అమెరికాలో వేర్పాటు ఉద్యమాల మాదిరిగానే, జర్మనీకి దాని సొంత విభజన సమస్యలు ఉన్నాయి. బ్రెగ్జిట్ తర్వాత స్వాతంత్ర్యం కావాలని కోరుకునే దక్షిణ జర్మనీ నుండి ఒక రాష్ట్రం ఉంది. అదే బవేరియా. బవేరియన్ సంస్కృతి, జర్మనీ మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బవేరియాలో సంవత్సరానికి 13 పబ్లిక్ హాలీడేస్ ఉండగా, జర్మనీకి కేవలం 9 మాత్రమే ఉన్నాయి. దీనికి కారణం జర్మనీ ప్రొటెస్టంటిజంను అనుసరిస్తే బవేరియా కాథలిక్ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఎందుకంటే బవేరియా చరిత్ర జర్మని కంటే చాలా భిన్నమైనది. బవేరియా యూరప్ లోనే అతి పురాతనమైన రాష్ట్రాలలో ఒకటి. కొన్ని వందల సంవత్సరాలు అతి సంపన్నమైన, ప్రభావంతమైన రాష్ట్రాలలో బవేరియా ఒకటి. 1871లో బవేరియా జర్మనిలో కలిసింది. కలవడమైతే కలిసింది కానీ,.. బవేరియా ప్రజల సంప్రదాయలు జర్మనీ కంటే ఆస్ట్రియాతోనే ఎక్కువగా ముడిపడి వున్నాయి. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత కూడా బవేరియా జాతీయవాద ఉద్యమం ఊపందుకుంది. కానీ వివిధ కారణాల వల్ల ఉద్యమం విజయవంతం కాలేదు. 1940, 50 లలో బవేరియా వేర్పాటువాదాని సమర్ధించే పార్టీ ఒకటి ఏర్పాటైంది. కొన్నేళ్లు పార్లమెంటులో కీలకపాత్ర కూడా పోషించింది. కానీ, కాలక్రమేణా ఆ పార్టీ ప్రభావం తగ్గిపోతూ వచ్చి.. ఇప్పుడు అసలు ఆస్తిత్వమే లేకుండా పోయింది. కానీ, బ్రెగ్జిట్ తర్వాత బవేరియా వేర్పాటువాదానికి మళ్ళీ ఊపొచ్చింది. 2016లో విడిపోవాలని డిమాండ్ తెరపైకి వచ్చినా.. కోర్టు తిరస్కరణతో ఆగిపోయింది.
ఇది మాత్రమే కాదు, యూరోప్‌లో జర్మనీ అత్యంత ధనిక దేశం కావడంతో ఆ దేశం వెనకపడిన యూరోపియన్ దేశాల ఆర్ధిక భారం కూడా మోస్తూవస్తోంది. కానీ, అసలు నిజం ఎంటంటే.. జర్మనీ జీడీపీలో 20 శాతం బవేరియాదే కావడంతో.. కేవలం జర్మనీదే కాకుండా ఇతర యూరోపియన్ దేశాల భారం కూడా బవేరియా మీద పడుతోంది. అంతేకాదు, జర్మనీకి వచ్చే వాలసదారులు బవేరియా నుంచే వెళ్ళాలి. దీన్ని కూడా అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జర్మనీకి వలసవాదులు ఎంత మంది వస్తున్నారో, దానివల్ల ఆ దేశ భౌగోళిక చిత్రం ఎలా మారిపోతోందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు.
సంప్రదాయం కావచ్చు, భాష కావచ్చు. బవేరియా జర్మనీ నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీని వల్లనే అక్కడి ప్రజలలో బవేరియన్ జాతీయవాదాన్ని అంతం అవ్వటంలేదు. నేటికీ, చాలామంది బవేరియన్లు తమను తాము బవేరియన్ ఫస్ట్, జర్మన్ సెకండ్ అని గుర్తించుకుంటారు.
అయితే, అటు అమెరికా కానీ, ఇటు జర్మనీ కానీ.. ఈ రెండు దేశాల్లో వేర్పాటువాద ఉద్యమాల ఊసు కూడా అంతర్జాతీయ మీడియాలో కనిపించదు. ఎందుకంటే, అలాంటి ఉద్యమాలను అక్కడి ప్రభుత్వాలు ఉక్కు పాదంతో అణచివేస్తాయి. మీడియా వాళ్ళ గుప్పిట్లో ఉండడం వల్ల వేర్పాటు వాద వాణి ప్రపంచానికి వినిపించదు. కానీ, అవే ప్రభుత్వాలు కశ్మీర్‌పై ఎటువంటి అధికారం లేని పాకిస్తాన్‌తో చర్చించాలని భారతదేశానికి నీతి బోధలు చేస్తుంటాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా భారత్ పిలుస్తుంటే, అమెరికా ప్రభుత్వం మాత్రం ఆజాద్ కశ్మీర్‌గా పిలుస్తోంది. భారత్‌లో వేర్పాటువాద ఉద్యమానికి అమెరికా ఏ విధంగా ఆజ్యం పోస్తోందో దీన్నిబట్టి స్పష్టంగా తెలుస్తోంది.
పాశ్చాత్య దేశాలు తమ దేశాలు ఐక్యంగా ఉండాలని కోరుకుంటాయి. కానీ, భారతదేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించవు అనేదానికి ఈ ద్వంద్వ వైఖరే పాశ్చాత్య దేశాలు కశ్మీర్‌లో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తూ ఉంటే,.. భారత్ కూడా అమెరికాలో, జర్మనీలో వేర్పాటు ఉద్యమాలకు పరోక్ష సహకారం అందించాలి. ప్రస్తుతం జర్మనీ ఆర్ధికంగా శక్తివంతంగా లేదు. పరిశ్రమలు మూతపడే దిశగా వెళ్తుండడంతో రీసెషన్ కంటే దారుణమైన పరిస్థితిలో ఆ దేశం ఉంది. దీనినే అవకాశంగా మలుచుకుని భారత్ తిరిగి బవేరియా ఉద్యమానికి ఊపిరి పోయాలి. భారత్ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పరోక్షంగా ఈ రెండు దేశాల వేర్పాటువాద ఉద్యమాలకు సహకారం అందించాలి. కానీ, భారత్ ఆ పని చేస్తుందా..? అగ్రదేశాలకు ఎదురొడ్డి నిలబడుతుందా..? అంటే అనుమానమే. కానీ, మోదీ, దోవల్, జైశంకర్ దీనిపై దృష్టిపెడితే సాధ్యమేనేమో..! ఎవరికి తెలుసు..!!