తైవాన్‎కు అగ్రరాజ్యం దళాలు..! యుద్ధం తప్పదా..?

0
787

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వేళ.. తైవాన్, చైనా వివాదం తెరపైకి వచ్చింది. ఉక్రెయిన్ ను ఉసిగొల్పినట్లే తైవాన్ ను సైతం అమెరికా చైనాను ఎదిరించేలా సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా తైవాన్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా ఆ పరిస్థితులు మరింత తీవ్రం అయ్యాయి.

తైవాన్‌ జలసంధి గుండా ఇటీవల యూఎస్‌ మారిటైమ్‌ విమానం పయనించడంతో చైనా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. అదీగాక తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఇటీవలే అమెరికాకి గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. పైగా ఇరు ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం ఏర్పడుతుందని హెచ్చరించింది కూడా. మరోవైపు తైవాన్‌ తమ ద్వీప సమీపంలోనే చైనా వైమానిక దళాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ పదే పదే ఫిర్యాదులు చేసింది.

దీంతో యూఎస్‌ కూడా తైవాన్‌ని ఇబ్బంది పెట్టవద్దని చైనాకి సూచించింది. తైవాన్‌ పట్ల ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఊరుకోనని… తైవాన్‌కి పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా మిలటరీ సాయాన్ని కూడా అందిస్తానని యూఎస్‌ తెగేసి చెపింది. ఈ మేరకు యూఎస్‌ తాను అన్నట్లుగానే మాటనిలబెట్టుకోవడమే గాక అన్నంత పనిచేసేసింది. దీంతో చైనా తీవ్రస్థాయిలో యూఎస్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందటూ కన్నెర్ర జేసింది. శాంతికి భంగం కలిగించే చర్యలకు దిగుతుందంటూ అమెరికా పై ఆరోపణలు చేసింది చైనా.

యూఎస్‌ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నొక్కి చెప్పింది. అంతేకాదు యూఎస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి తమ సైన్యం సదా అప్రమత్తంగానే ఉందని చైనా స్పష్టం చేసింది. ఈ మేరకు భూ, వాయు మార్గాల్లో చైనా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండ్‌ ఒకరు తెలిపారు. తైవాన్‌ని తన భూభాగంగానే భావిస్తున్న చైనాకి అమెరికా ఈ వ్యవహరంలో తలదూర్చడం మింగుడు పడని అంశంగా మారింది. ఐతే ఈ వ్యాఖ్యలపై అమెరికా నావికదళం ఇం‍కా స్పందించలేదు.

అయితే ఇప్పుడున్న తైవాన్ ఒకప్పుడు చైనాలో అంతర్భాగంగా ఉండేది. కానీ 1949లో వచ్చిన అంతర్యుద్ధంతో చైనా, తైవాన్ విడిపోయాయి. అప్పటి నుంచి తైవాన్ ప్రత్యేక ప్రాంతంగా ఉంటోంది. కానీ చైనా ఈ చీలికను ఒప్పుకోవడంలేదు. తైవాన్ చైనాలో అంతర్భాగమంటూ మొండి వాదన చేస్తోంది. అందుకే విలీనం కావాలంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు. అందుకే తైవాన్‌ను రెచ్చగొట్టే ధోరణిని చైనా కొనసాగిస్తోంది. అయితే చైనా దురాక్రమణకు దిగితే ఊరుకునే ప్రసక్తి లేదని తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ తైవాన్ సమస్యను మళ్లీ తెరపైకి తీసుకువచ్చాయి. అలాగే తైవాన్ కు అమెరికా సపోర్ట్ చేయడం డ్రాగన్ దేశానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తాజా పరిణామాలు ఉద్రిక్తంగా మారడంతో తైవాన్ పై చైనా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తైవాన్ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఇంతకుముందే హెచ్చరించి అమెరికా.. ఒకవేళ డ్రాగన్ దేశం దాడికి దిగితే అగ్రరాజ్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 × three =