భత్కల్ మునిసిపల్ కౌన్సిల్ బోర్డు నుండి ఉర్దూ తొలగింపు

0
818

కర్ణాటక రాష్ట్రంలోని భత్కల్ లోని మునిసిపల్ కౌన్సిల్ బోర్డు నుండి ఉర్దూను తొలగించారు. భత్కల్ పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో ఉర్దూ సైన్ బోర్డులను ఉపయోగించడంపై వివాదం చెలరేగింది. ఇరువర్గాల వాదనలు విన్న ఉత్తర కన్నడ డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్ సైన్ బోర్డును తొలగించాలని ఆదేశించారు. భారీ భద్రత నడుమ అధికారులు బోర్డును తొలగించారు.

కొద్ది రోజుల క్రితం కార్పొరేషన్ భవనాన్ని పునరుద్ధరించిన తర్వాత, కన్నడ, ఇంగ్లీష్ సైన్‌బోర్డ్‌లతో పాటు ఉర్దూ భాషలో కార్పొరేషన్ పేరు కనిపించింది. ఉర్దూ సైన్‌బోర్డ్‌లను తొలగించాలని లేదా కొంకణి మరియు నవయత్ వంటి ఇతర స్థానికంగా మాట్లాడే భాషలలో కొత్త సైన్‌బోర్డ్‌లను జోడించాలని డిమాండ్ చేశారు స్థానిక ప్రజలు. స్థానిక అధికారులు.. ఉర్దూను తొలగించాలని నిర్ణయించగా.. ఉర్దూ సైన్ బోర్డులను అలాగే ఉంచాలని డిమాండ్ చేస్తూ ముస్లిం నిరసనకారుల సమూహం కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళనకు కూడా దిగారు.

ఉత్తర కన్నడ డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్ భత్కల్‌లోని మినీ విధాన్ సౌధలో స్థానికులు, అధికారులతో సమావేశమైన తర్వాత భత్కల్ టౌన్ మున్సిపల్ కౌన్సిల్ (TMC) భవనం నుండి ఉర్దూ పేరును తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ భవనాలపై భాషలను ఉపయోగించడంపై నియమాలు, ప్రభుత్వ నిబంధనలను ఉటంకిస్తూ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వు జారీ చేయడానికి ముందు, DC టౌన్ మునిసిపల్ కౌన్సిల్ కౌన్సిలర్లు, మజ్లిస్-ఇ-ఇస్లాహ్ వా తంజీమ్ ప్రతినిధులు, ఉర్దూ భాషపై నిరసన తెలుపుతున్న సంఘ్ పరివార్ మద్దతు సంస్థలతో ఇన్‌స్పెక్షన్ బంగ్లాలో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఉర్దూ సైన్ బోర్డును తొలగించారు.