బురఖాతో పరీక్ష రాయడానికి వీలు లేదనడంతో 40 మంది ముస్లిం యువతులు పరీక్ష రాయలేదు

0
928

కర్నాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన కనీసం నలభై మంది ముస్లిం బాలికలు మంగళవారం జరిగిన మొదటి ప్రీ-యూనివర్సిటీ పరీక్షకు హాజరు అవ్వడానికి నిరాకరించారు. ఇటీవలే కర్నాటక హైకోర్టు క్లాస్‌రూమ్‌లలో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ తీర్పు ఇవ్వడంతో వారు పరీక్షలకు హాజరవ్వలేదు. కుందాపూర్‌కు చెందిన కనీసం 24 మంది బాలికలు, బైందూరు నుండి 14 మంది, ఉడిపి ప్రభుత్వ బాలికల ప్రీ-యూనివర్సిటీ కళాశాల నుండి ఇద్దరు విద్యార్థులు యూనిఫాం డ్రెస్ కోడ్‌ను పాటించనందున పరీక్షలకు హాజరవ్వలేదు. గతంలో, ఈ అమ్మాయిలు ప్రాక్టికల్ పరీక్షలను కూడా బహిష్కరించారు. అదే విధంగా ఆర్ ఎన్ శెట్టి పీయూ కళాశాలలో 28 మంది ముస్లిం విద్యార్థినులకు గాను 13 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. కొందరు విద్యార్థులు హిజాబ్‌లు ధరించి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు, ఇస్లామిక్ దుస్తులలో పరీక్షలు రాయడానికి అనుమతించాలని వాదించారు. అయితే కళాశాల అధికారులు వారికి అనుమతి నిరాకరించారు. ఉడిపిలోని భండార్కర్ కాలేజీలో పరీక్షలకు హాజరయ్యేందుకు ఓ విద్యార్థిని నిరాకరించింది. నవుండ ప్రభుత్వ పీయూ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థినులలో ఆరుగురు పరీక్షలకు గైర్హాజరయ్యారు.

ప్రిపరేటరీ పరీక్షలకు హాజరు కావడానికి ముస్లిం విద్యార్థులు నిరాకరణ

రెండు వారాల ముందు, కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పినంగడిలోని ప్రభుత్వ PU కళాశాలలో చదువుతున్న కనీసం 231 మంది ముస్లిం విద్యార్థులు తమ హిజాబ్‌లను తొలగించమని కోరడంతో SSLC ప్రిపరేటరీ పరీక్షలకు హాజరు కావడానికి నిరాకరించారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి, విద్యాసంస్థల్లో హిజాబ్ లేదా బురఖా వంటి మతపరమైన దుస్తులను నిషేధించాలని ఆదేశించారు. విద్యాసంస్థలలో డ్రెస్ కోడ్‌ను అనుసరించాలని కళాశాల అధికారులు విద్యార్థులను కోరారు. బాలికలు తమ హిజాబ్‌ను తొలగించడానికి నిరాకరించారు.. అందుకే కళాశాల అధికారులు వారిని పరీక్షకు కూర్చోవడానికి అనుమతించలేదు.

క్యాంపస్‌లో యూనిఫాం డ్రెస్ కోడ్‌లను తప్పనిసరి చేసే విద్యాసంస్థల హక్కులను కర్ణాటక హైకోర్టు సమర్థించినప్పటికీ ముస్లిం విద్యార్థులు పాఠశాలలకు హిజాబ్ ధరించాలని పట్టుబట్టారు. చారిత్రాత్మక తీర్పులో, కర్ణాటక హైకోర్టు హిజాబ్ ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని పేర్కొంది. విద్యాసంస్థల ప్రాంగణంలో మతపరమైన దుస్తులను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించింది. పాఠశాలలు, కళాశాలలు తమ ప్రాంగణంలో యూనిఫాం డ్రెస్‌ కోడ్‌ను తప్పనిసరి చేసే హక్కు ఉందని పేర్కొంది.

గదగ్‌లోని సీఎస్‌ పాటిల్‌ బాలుర ఉన్నత పాఠశాల, సీఎస్‌ పాటిల్‌ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలకు కొంద‌రు విద్యార్థినులు హిజాబ్ ధ‌రించి వ‌చ్చారు. దీంతో హిజాబ్ ధరించినా ఎందుకు అనుమ‌తించార‌ని ప్ర‌శ్నిస్తూ ఏడుగురు ఉపాధ్యాయులపై అధికారులు సస్పెన్ష‌న్ వేటు వేశారు. ఇద్దరు సెంటర్ సూపరింటెండెంట్లపై కూడా సస్పెన్ష‌న్ వేటు పడింది.