మహారాష్ట్రలో మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని సీబీఐ బాంబే హైకోర్టుకు తెలిపింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తమతో సమన్వయంగా వ్యవహరించలేదని.. అంతేకాకుండా ముంబై పోలీసు శాఖలో ఓ ఏసీపీ తమ అధికరినొకరిని బెదిరిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. సీబీఐ బృందానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేదని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను బెదిరించిన ముంబై ఏసీపీపై కూడా సిబిఐ తన పిటిషన్‌లో తెలియజేసింది.
ఈ విషయాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తూ ఈ కేసు విచారణ మళ్ళీ ఈ నెల 11 న జరగాలని సూచించింది. ముంబై పోలీసు శాఖలో ఎవరో ఏసీపీ సిబిఐ అధికారిని బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయని, దీనిపై ఆరా తీయాలని న్యాయమూర్తులు ఎస్.ఎస్. షిండే, జమాదార్ లతో కూడిన బెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశించింది. పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తే తాము తీవ్రమైన చర్య తీసుకోవలసి ఉంటుందని బెంచ్ హెచ్చరించింది.
ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి తనకు నెలకు 100 కోట్ల రూపాయలను వసూలు చేసి ఇవ్వవలసిందిగా అనిల్ దేశ్ ముఖ్ మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేని ఆదేశించడం, ఆ తరువాత వాజేని జాతీయ దర్యాప్తు సంస్థ తమ కస్టడీలోకి తీసుకుని జైలుకు పంపడం జరిగాయి. అనిల్ దేశ్ ముఖ్ అవినీతి కేసును సీబీఐ గత రెండు మూడు నెలలుగా విచారిస్తోంది. ముంబై, నాగ పూర్ లలో గల ఆయన నివాసాలపై రెండు సార్లు దాడులు జరిపింది. అనిల్ దేశ్‌ముఖ్‌కు చెందిన రూ.4.20 కోట్ల విలువైన చిరాస్థులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జప్తు చేసింది. అనిల్ దేశ్‌ముఖ్‌కు సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్ జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో జప్తు చేసిన ఆస్తుల విలువు సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చిన అభిప్రాయపడుతున్నారు. నేవీ ముంబైలో ప్రతిపాదిత విమానాశ్రయానికి సమీపంలో ఒక ఫ్లాట్, భారీ మొత్తంలో ఇండ్ల స్థలం అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయి.
అక్రమ సొమ్ము శ్రీ సాయి శిక్షణ సంస్థ పేరుతో ఉన్న ట్రస్టుకు వచ్చిన నిధులుగా దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులు చూపిస్తున్నట్టు ఈడీ అంటోంది. ఈ కేసులో అనిల్ దేశ్‌ముఖ్ ప్రైవేటు కార్యదర్శి సంజీవ్ పలాండే, ప్రైవేట్ అసిస్టెట్ కుందన్ షిండేలను ఈడీ అరెస్టు చేసింది. దేశ్‌ముఖ్‌పై ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణకు సంబంధించి ఓవైపు సీబీఐ దర్యాప్తు జరుపుతుండగా, మరోవైపు ఆయన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది.