More

    ఇంధన ధరల పెరుగుదలకు అసలు కారణాలేంటి.. లెఫ్ట్ లుటియెన్స్ మీడియా నిజాలను దాస్తోందా?

    ఇంధన ధరలు పెరిగాయి. ఇది అంగీకరించాల్సిన సత్యం. సామాన్యుల ఆర్థిక జీవితం అతలాకుతలమవుతోంది. మధ్య తరగతి ఇబ్బంది పడుతోంది. ఇవి ఒప్పుకోవాల్సిన వాస్తవాలు. సత్యం, వాస్తవం వెనుక సందేహం కూడా షరామామూలుగా ఉంటుంది కాబట్టి దానివైపు కూడా దృష్టి సారించాలి. ధరల పెరుగుదలకు కారణమెవరు? ఇది చర్చించాల్సిన ప్రశ్న. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ఏ పాతికో, డెబ్భై రూపాయలకో పరిమితమై ఉండేదా? ఇది ఇంగితం ఉన్నవారికి కలిగే అనుమానం. పోనీ 2019లో మరోసారి బీజేపీ కలవకపోతే…చమురు ధరలు పదో…పరకో ఉండేవా? అనే విస్మయం కూడా కలగవచ్చు.
    పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాజకీయ పక్షాలు, వామపక్ష సంస్థలు, మేధావులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని ‘నేషనలిస్ట్ హబ్’ టీమ్ ఇంధన ధరల కథా కమామిషు గురించి అవలోకనం చేసే ప్రయత్నం చేసింది.
    చమురు ధరల పెరుగుదలకూ ఒపెక్ దేశాల ఉత్పత్తి నియంత్రణ నిర్ణయానికీ కారణం ఏంటి? 204తో పోలిస్తే చమురు బ్యారెల్ ధర తగ్గినా రూపాయి విలువ పతనం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు? పెట్రోల్ దిగుమతిని తగ్గించుకోవడమా లేదా విదేశాల నుంచి వచ్చే ఇంధనం పై ఆధారపడి గుల్ల కావడమా? కేంద్రం చేస్తున్న ప్రత్యామ్నాయాలేంటి? ధరల పెరుగుదల విషయంలో గత ప్రభుత్వాల పాత్ర ఏ మాత్రం? అసలు మొత్తంగా పెట్రోల్ కథా, కమామిషు ఏంటో తరచి చూసే ప్రయత్నంలో భాగమే ఈ రైట్ యాంగిల్.
    అంతర్జాతీయ చమురు మార్కెట్ నరేంద్ర మోదీ కనుసన్నల్లో ఉండదు. దిగజారే రూపాయి విలువను మోదీ అద్భుతదీపం ఒడిసిపట్టలేదు. మోదీ ఒక పాలకుడు. నివారణా చర్యలను కాసింత వేగంగా తీసుకోగల నిబ్బరం ఉన్నవారు. ఏడారి దేశాల్లో వెలికితీసే చమురు ధరలపై ఆయా దేశాల్లోని అస్తవ్యస్త స్థితులు కూడా ప్రభావం చూపిస్తాయి. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిని డాలర్ విలువ ఆధారంగా నిర్ణయిస్తారు. రూపాయి విలువ క్షీణిస్తే ఆ ప్రభావం ద్రవ్యోల్బణంపైన పడుతుంది.
    దేశంలో దాదాపు 80శాతం చమురు విదేశాల నుంచే వస్తుంది. చమురు దరలు పెరగడంతో భారత్ మరిన్ని ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. 2013 వరకూ పెట్రోల్‌పై కేంద్రం, రాష్ట్రాలు విధించే పన్నులు దాని అసలు ధరలో 44 శాతం వరకూ ఉండేవి. ఇప్పుడు అవి 100 నుంచి 110 శాతం వరకూ పెరిగాయి.
    పెట్రోల్-డీజిల్ ధరలు ఒక్క మే నెలలోనే 16 సార్లు పెరిగాయి. మే, జూన్ మధ్య పెట్రోల్, డీజిల్ ధరలను 32 సార్లు పెంచారు. గత నెలలలో నవంబర్ మాసంలో 3,4,5,6 తేదీల్లో పెట్రోల్, డీజిల్ రెండింటి ధరలు నాలుగు సార్లు పెరిగాయి.
    చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే ప్రక్రియను కూడా కేంద్రం ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రస్తుతం పెట్రోల్‌లో 8.5 శాతం ఇథనాల్ కలుపుతున్నారు. 2025 కల్లా దీన్ని 20 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇథనాల్‌ను చెరుకు నుంచి తీస్తారు. ఇథనాల్ కలపడాన్ని పెంచితే చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనం అందించవచ్చు.
    కరోనా సంక్షోభం తర్వాత చైనాలో ఆర్థిక వృద్ధి వేగంగా జరుగుతోంది. అక్కడ డిమాండ్ కూడా పెరుగుతోంది. మరోవైపు సౌదీ అరేబియా సహా చమురు ఉత్పత్తి చేసే దేశాల సంఘం -ఓపెక్ ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ కారణాలతో ముడి చమురు ధర కూడా పెరుగుతోంది.
    చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి దేశీయంగా చమురు నిక్షేపాలను గుర్తించడం… చమురు, గ్యాస్ బావులను అభివృద్ధి చేసుకోవడం అవసరం. ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చాలా పనిచేసింది. కానీ, అండర్‌గ్రౌండ్ డేటా, బిజినెస్ కాన్ఫిడెన్స్, పన్నుల విషయంలో ఇంకా స్పష్టత లేదు.
    చమురు, గ్యాస్ రంగాల్లో అనేక న్యాయపరమైన వివాదాలున్నాయి. విదేశీ సంస్థలు రెట్రోస్పెక్టివ్ పన్ను విషయంలో భయంతో ఉన్నాయి. దీంతో పెట్టుబడి కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చమురు, గ్యాస్ రంగాన్ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాకపోవడం కూడా సంస్థలు ఈ రంగానికి దూరంగా ఉండటానికి కారణమవుతోంది.

    పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నిరసనలు చేపట్టింది. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే, 2014కి ముందు ఆయిల్ కంపెనీలకు బాండ్లను జారీ చేసిన కాంగ్రెస్ పార్టీయే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణమని కేంద్రం సహా మేధావులు కూడా వాదిస్తున్నారు. యూపీఏ హయాంలో జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు, వడ్డీని చెల్లించాల్సి ఉందని, ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయి.
    పెట్రోలియం ధరలపై ఆర్థికవేత్త ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిందేమిటి, చేసిందేమిటి? డబ్బులు చెట్లకు కాయవు అంటూ రూ.1.3 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ బిల్లులు చెల్లించకుండానే వెళ్లిపోయారు. మోదీ ప్రభుత్వం ఆ బిల్లులన్నింటినీ వడ్డీతో సహా చెల్లించింది.
    ఈ బాండ్ల గొడవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
    కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ చేస్తున్న వాదనల్లో తరచుగా వినిపిస్తున్న పేరు చమురు బాండ్లు. అసలు ఈ చమురు బాండ్లు అంటే ఏంటో తెలుసుకోవడం అవసరం. చమురు కంపెనీలు, ఎరువుల కంపెనీలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలకు వివిధ బాండ్లను జారీ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
    దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు పెరుగుతున్న దృష్ట్యా చమురు ధరలు సాధారణ ప్రజలకు భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చేది. అంటే, అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు ఎలా ఉన్నా, దేశంలోని ప్రభుత్వాలు వాటిని నియంత్రించగలవు.
    అదే సమయంలో, గత ప్రభుత్వాలు చమురు కంపెనీలకు చమురు బాండ్లను జారీ చేశాయి. యూపీఏకు ముందు కూడా ప్రభుత్వం కూడా చమురు బాండ్లను జారీ చేసింది. ఆయిల్ బాండ్లు నగదు రాయితీలకు బదులుగా చమురు కంపెనీలకు ప్రభుత్వాలు ఇచ్చే హామీయే ఈ బాండ్లు.
    సాధారణంగా ఈ బాండ్లు ఎక్కువ కాలం చెల్లుబాటులో ఉంటాయి. చమురు కంపెనీలకు వీటిపై వడ్డీ కూడా చెల్లిస్తారు. కాబట్టి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తన ఖజానాపై భారం పడకుండా 2005 నుండి 2010 వరకు చమురు కంపెనీలకు చమురు బాండ్లను జారీ చేసింది.

    దేశంలో ఆర్థిక మందగమనం తరువాత 2010లో పెట్రోల్ ధరలను నియంత్రించే పని నుంచి ప్రభుత్వాన్ని యూపీఏ బైటికి తీసుకు వచ్చింది. అప్పటి నుంచి ఆయిల్ బాండ్ల జారీ ముగిసింది. ప్రభుత్వ నియంత్రణ ముగియడం అంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర పెరిగే కొద్దీ, దేశంలోని చమురు కంపెనీలు తమ ధరలను మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచడం, తగ్గించడం చేస్తాయి. అంటే, చమురు ధరల భారం నేరుగా సాధారణ వినియోగదారుడి భుజాల మీద పడింది.
    2014లో కేంద్రంలో ప్రభుత్వం మారింది. అదే సంవత్సరం అక్టోబర్‌లో మోదీ ప్రభుత్వం కూడా డీజిల్‌ను ప్రభుత్వ నియంత్రణ నుండి తప్పించింది. మొదట్లో పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉండేవి. కానీ జూన్ 15, 2017 నుండి డైనమిక్ ఆయిల్ ప్రైస్ విధానం అమలులోకి వచ్చింది. దీంతో చమురు ధరలు రోజువారీగా హెచ్చుతగ్గులకు గురయ్యాయి.
    ప్రభుత్వ బడ్జెట్ డేటా ప్రకారం.. గత యూపీఏ ప్రభుత్వ కాలంలో జారీ చేసిన సుమారు 1.31 లక్షల కోట్ల చమురు బాండ్లను 2026 మార్చి నాటికి చమురు కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ -సీసీఐఎల్ గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం 2014 నుండి చెల్లించాల్సిన అసలులో రూ.3,500 కోట్లు తిరిగి చెల్లించింది. ఈ సంవత్సరం ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయల విలువైన బాండ్ల మెచ్యూరిటీని చెల్లించబోతోంది.
    అక్టోబర్ 16, 2006న 15 సంవత్సరాలపాటు చెల్లే విధంగా రూ. 5000 కోట్ల విలువైన చమురు బాండ్లను అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు జారీ చేసింది. వీటి మెచ్యూరిటీ ఈ ఏడాది అక్టోబర్ 16న ఉంటుంది. 2006 నవంబర్ 28న జారీ చేసిన రూ.5000 కోట్ల చమురు బాండ్‌ల మెచ్యూరిటీ కూడా ఈ ఏడాది నవంబర్ 28కి ఉంటుంది.
    2008లో జారీ చేసిన రూ. 22,000 కోట్ల చమురు బాండ్లు నవంబర్ 10, 2023 నాటికి చెల్లించాలి. 2006లో జారీ చేసిన రూ .4,150 కోట్ల విలువైన ఆయిల్ బాండ్లు డిసెంబర్ 15, 2023 నాటికి చెల్లించాలి. 2007లో జారీ చేసిన రూ. 5,000 కోట్ల విలువైన ఆయిల్ బాండ్లు ఫిబ్రవరి 12, 2024 నాటికి మెచ్యూరిటీకి వస్తాయి. ఈ మొత్తం రూ.31,150 కోట్లు అవుతుంది. ఈ ఏడాది అంటే 2021లో చెల్లించాల్సిన రూ.10 వేల కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.
    మోదీ ప్రభుత్వం తన మొదటి పదవీ కాలం మొదటి సంవత్సరంలో అంటే 2014-15లో ఎక్సైజ్ సుంకం నుండి పెట్రోల్‌పై రూ.29,279 కోట్లు, డీజిల్‌పై రూ.42,881 కోట్లు సంపాదించింది. ఈ ఏడాది మార్చిలో లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకుర్ తన లిఖిత పూర్వక సమాధానంలో, 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో పన్నుపై వచ్చే ఆదాయం పెట్రోల్, డీజిల్ రూ. 2.94 లక్షల కోట్లకు పెరిగిందపన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో దీర్ఘకాలిక లాక్‌డౌన్లు విధించిన సంవత్సరం పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింది. చమురు కంపెనీల బాండ్లకు కోసం కేంద్ర ప్రభుత్వం అసలు రూ.1.31 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి వడ్డీ కూడా కలిపితే రెట్టింపు అవుతుంది.
    దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో 85% భారత ప్రభుత్వం దిగుమతి చేసుకోవాలి. ముడి చమురు బ్యారెల్‌కు సుమారు రూ. 75 ఖర్చు అవుతుంది. సోమవారం, ఈ ధర రూ. 74.58. అంటే, రూపాయి విలువ ఆధారంగా ఒక బ్యారెల్ ముడి చమురు ధర రూ. 5540.32. ఇప్పుడు ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు. అంటే ముడి చమురు ధర లీటరుకు 34.84 రూపాయలు.
    ముడి చమురును కొనుగోలు చేసిన తరువాత, దానిని భారతదేశానికి తీసుకురావడానికి, పోర్టుల నుంచి రిఫైనరీకి తీసుకెళ్లడానికి రవాణ ఖర్చులు ఉంటాయి. దీనిని ప్రాసెస్ చేసిన తరువాత, ఈ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రూపంలో డీలర్లకు పంపిణీ చేస్తాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం, డీలర్ల కమిషన్‌ను జత చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను విధిస్తాయి.
    డీలర్‌కు చేరినప్పుడు పెట్రోల్ ధర లీటరుకు రూ.35.65 గా ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం రూ.32.90 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది, డీలర్ కమీషన్‌ను ఇందులో చేరుస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తాయి. అంటే కేంద్రం పన్ను విధిస్తే పెట్రోల్, డీజిల్ రేటు 70 రూపాయల లోపు ఉంటుంది అన్నమాట. మిగతా నలభై పై చిలుకు రూపాయల పన్ను ఆయా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి అన్నమాట.
    రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కోసం పెట్రోల్ పై వ్యాట్ విషయంలో గందరగోళం ఉంది. అందేంటో క్లారిఫై చేస్తాను. కేంద్రం కోరుకుంటే తాను నష్ట పోకుండా పెట్రోల్, డీజిల్ ధరలలో కనీసం రూ.4.50 తగ్గించవచ్చు.
    కానీ, కేంద్రం పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ. 10ని తగ్గించింది. అంటే చమురు బ్యారెల్ ధర తగ్గినా….రూపాయి విలువ తగ్గిందన్న ఇంగితం మర్చిపోతే ఎలా అన్నదే ప్రశ్న.
    రూపాయి విలువ పెరిగేందుకు కేంద్రం ఏం చేసింది అనేదానికి జవాబు వెతుకుదాం. డాలర్‌ మారకంలో రూపాయి విలువ అక్టోబర్ 22 నాటికి ఎగసింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 47 పైసలు లాభపడి 74.88 వద్ద ముగిసింది. రానున్న వారాల్లో జారీ కానున్న క్విప్, ఐపీఓల ద్వారా మార్కెట్‌లోకి భారీ విదేశీ నిధుల ప్రవాహం జరుగుతుందన్న అంచనాలు రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయన్నది నిపుణుల అభిప్రాయం. దీనికితోడు ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా కొంత శాంతించడం, తగ్గిన డాలర్‌ ఇండెక్స్‌ దూకుడు వంటి అంశాలు కూడా రూపాయికి కలిసి వచ్చాయి. నిజానికి రూపాయి మరింత బలపడాల్సిందని, అయితే ఈక్విటీల బలహీన ధోరణి రూపాయిని కొంతమేర కట్టడి చేస్తున్నాయి.
    అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ స్వల్ప లాభాల్లో 74.77 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల -యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా ప్రాతిపదకన లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌ స్వల్ప నష్టాల్లో 93.64పైన ట్రేడవుతోంది.
    బాండ్లు జారీ చేసి అప్పుల నుంచి తప్పుకుంది నాటి యూపీఏ ప్రభుత్వం. అంటే తాత్కాలికంగా ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించింది నాటి ప్రభుత్వం. బాండ్ల రూపంలో నాడు ఒప్పందం చేసుకున్నవాటి విలువ ఇవాళ ఎంత? 2014 నాటికీ నేటికీ రూపాయి మేరకు మారింది? మారిన రూపాయి ధరతో సంబంధం లేకుండా పెట్రోల్ ధరను నిర్ధారించడం సాధ్యమా? ఈ ప్రశ్నలే అత్యంత కీలకమైనవి. ప్రత్యామ్నాయ వనరుల వినియోగంవైపు దృష్టి సారించకుండా పెట్రోల్ ధర తగ్గాలనుకోవడం అసాధ్యం. దిగుమతి తగ్గకుండా ధర ఎలా తగ్గుతుంది? ఎల్లకాలం ప్రభుత్వమే కాదు, కొన్ని సార్లు ప్రజలు కూడా ఆలోచించాలి. ఇదీ మా విన్నపం.

    Trending Stories

    Related Stories