ఇంటి నుండి బయటకు వచ్చే సమయంలో మాస్కులను పెట్టుకోవాల్సిందే..! కరోనా మహమ్మారిని అంతం చేయాలి అంటే సామాజిక దూరం, మాస్కులను ధరించడం వంటివి పాటించాలి. కానీ కొందరు కనీసం పట్టించుకోరు. అయితే బ్యాంకుకు వచ్చిన ఓ వ్యక్తిని సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి మాస్కు పెట్టుకోమని కోరాడు. ఎన్ని సార్లు చెప్పినా కూడా సదరు కస్టమర్ మాట వినలేదు. దీంతో సెక్యూరిటీ తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్చేశాడు. సదరు కస్టమర్ కాలులోకి తూటా వెళ్ళిపోయింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ఉండగా.. సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన శుక్రవారం నాడు చోటు చేసుకుంది. శుక్రవారం (జూన్ 25) భోజన సమయంలో మాస్క్ ధరించకుండా బ్యాంకులోకి ప్రవేశించనందుకు ఒక సెక్యూరిటీ గార్డు కస్టమర్ పై కాల్పులు జరిపాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా జంక్షన్ రోడ్ బ్రాంచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిందితుడిని కేశవ్ ప్రసాద్ మిశ్రాగా గుర్తించారు. రైల్వే ఉద్యోగి అయిన కస్టమర్ రాజేష్ కుమార్ మాస్క్ ధరించనందుకు సెక్యూరిటీ గార్డు చేత ఆపివేయబడ్డాడు.
రాజేష్ భార్య ఈ ఘటన గురించి మాట్లాడుతూ “గార్డు మొదట నా భర్తను బ్యాంకులోకి ప్రవేశించకుండా ఆపి మాస్క్ ధరించమని అడిగాడు, ఆ తరువాత అతను మాస్క్ ధరించాడు. తన భర్త మళ్ళీ బ్యాంకు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు గార్డు మళ్ళీ అతనిని ఆపివేసాడు. భోజన సమయం కావడంతో అతను లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు ” ఆమె చెప్పింది, “నా భర్త కొంచెం గొడవ చేసిన తరువాత బ్యాంకులోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు, ఇంతలో గార్డు నా భర్తను కాల్చాడు. గార్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ” అని ఆమె తెలిపింది.
ఈ సంఘటన ఉదయం 11:30 గంటలకు జరిగింది. బాధితుడి ఛాతీపై కాలుస్తానని గార్డు హెచ్చరించాడు. అలాగే తన భర్త ఫోన్ కూడా పగిలిపోయిందని ఆ మహిళ తెలిపింది. రాజేష్ తొడ లోకి తూటా దూసుకు వెళ్ళింది.
సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ “అతనికి మాస్కు లేదు. ఆ విషయాన్ని నేను చెప్పాను.. దీంతో అతడు వెళ్లి మాస్కు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత అతడు వచ్చి తిట్టడం మొదలు పెట్టాడు. లోపలికి వెళ్లాలని నన్ను నెట్టడం ప్రారంభించాడు. కొద్దిసేపు నన్ను నెట్టడం కూడా జరిగింది. నన్ను కదిలించడం కూడా జరిగింది, ఈ కాల్పులు ప్రమాదవశాత్తు జరిగాయి. నేను కూడా గాయపడ్డాను, నా బటన్లు ఊడిపోయి ఉండడం మీరు చూడవచ్చు. నా రైఫిల్ లోడ్ చేయబడింది.. ట్రిగ్గర్ అనుకోకుండా నొక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని” తెలిపాడు.
ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఐజిపి (బరేలీ రేంజ్) రమిత్ శర్మ, ఎస్‌ఎస్‌పి రోహిత్ సింగ్ సజ్వాన్, ఎస్పీ (సిటీ) రవీంద్ర కుమార్‌లతో కూడిన పోలీసు బృందం బ్యాంకుకు చేరుకుంది. బరేలీ ఎస్‌ఎస్‌పి రోహిత్ సజ్వాన్ మాట్లాడుతూ, “రైల్వే ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. అతని ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. గార్డును అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది. ” అని తెలిపారు. పోలీసులు ఇప్పుడు ఘర్షణకు కారణం, కాల్పులు ఎందుకు జరిపాడో పూర్తిగా తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోల్లో బాధితుడు రక్తపు మడుగులో నేలమీద పడి ఉండడాన్ని చూడవచ్చు. నిందితుడు చేతిలో తుపాకీతో సమీపంలో నిలబడి ఉండగా బాధితుడి భార్య పక్కన కూర్చొని కనిపించింది.