ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లోని రాష్ట్ర మంత్రి ఠాకూర్ రఘురాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మదర్సాలు తీవ్రవాదాన్ని పెంచుతున్నాయని, వాటిని మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మదర్సాలు ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నాయని, ఉగ్రవాదులందరూ మదర్సాలలో చదివారని వీడియో ప్రకటనలో మంత్రి తెలిపారు. తనకు అవకాశం ఇస్తే దేశవ్యాప్తంగా నడుస్తున్న మదర్సాలన్నింటినీ మూసివేస్తానని చెప్పారు.
ఉగ్రవాదులందరూ మదర్సాలలో చదువుకున్న వాళ్లే: ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్
ఉగ్రవాదులను పుట్టుకురావడానికి మదర్సాలే కారణమని ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ తెలిపారు. ఈ మతపరమైన పాఠశాలలు ఇస్లామిక్ తీవ్రవాదం మరియు మిలిటెన్సీని ప్రోత్సహిస్తాయని ఆయన చెప్పారు. మదర్సాలు తప్పనిసరిగా ఉగ్రవాదులకు శిక్షణనిస్తాయని తాను నమ్ముతున్నానని, దేశం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే, ముందుగా అన్ని మదర్సాలను మూసివేయాలని అన్నారు. ‘‘దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న మదర్సాలన్నింటినీ మూసేసే అవకాశాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుతున్నాను” అని రఘురాజ్ సింగ్ అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో మదర్సాల సంఖ్య పెరగడం పట్ల కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు 250గా ఉన్న మదర్సాల సంఖ్య ఇప్పుడు 22,000కు చేరుకుందని, దేశవ్యాప్తంగా మదర్సాలను నిషేధించాలని మోదీ ప్రభుత్వాన్ని మంత్రి కోరారు. మదర్సాలు టెర్రరిస్టులను ఉత్పత్తి చేస్తున్నాయని ఏ ప్రాతిపదికన పేర్కొన్నారో వివరించమని అడిగినప్పుడు.. ఆయన వెంటనే హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది మన్నన్ వానీ గురించి ఉదాహరణగా చెప్పారు. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో ఉత్తీర్ణత సాధించిన వానీ జమ్మూకశ్మీర్‌లోని మదర్సాలో చదువుకున్నాడని తెలిపారు. నిజానికి ఐఎస్ఐఎస్ ఏజెంట్లంతా ఏదో ఒక మదర్సా నుండి వచ్చిన వారేనని యూపీ మంత్రి అన్నారు.
కేరళలోని రాడికల్ ఇస్లాంవాదులపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఆ రాష్ట్రంలోని కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో కేరళ ఐఎస్‌ఐఎస్‌కు కేంద్రంగా మారిందని ఆయన మండిపడ్డారు. హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని, మతమార్పిడి చేసిన ‘లవ్ జిహాద్’ కేసులు కేరళలో నమోదయ్యాయి. ఇక ఎంతో మంది యువతను బ్రెయిన్‌వాష్ చేసి ఐఎస్‌ఐఎస్‌లో చేరిన ఘటనలు కూడా కేరళలో చోటు చేసుకున్నాయి.