ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా యూపీ..! సరిలేరు నాకెవ్వరు అంటున్న యోగి..!!

0
832

యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో యూపీ అభివృద్ది పథంలో దూసుకెళుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా పెట్టుబడులను ఆకర్షిస్తూ.. రాష్ట్రాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చేస్తున్నారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమే అయినా.. గత పాలకులు అభివృద్దిని ఏనాడూ పట్టించుకోలేదు. ఇప్పటికీ యూపీలోని ప్రజలు ప్రక్క రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్ళి జీవిస్తున్నారు. అయితే వీరికి స్థానికంగా ఉపాధి కోసం పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో యూపీ సీఎం పని చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షిస్తే స్థానికంగా ఉపాధి దొరకడంతో పాటు రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అభివృద్ది కోసం పెట్టుబడులు ఆకర్షించడానికి పక్కా ప్రాణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‎మెంట్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ పాలసీ 2022 ను రాష్ట్ర కేబీనెట్ ఆమోదించింది. రాబోయే ఐదేళ్ళలో యూపీని వన్ ట్రిలియన్ డాలర్ ఎకనమీగా మార్చడమే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించారు. అయితే 2021-22 ఆర్థిక లెక్కల ప్రకారం యూపీ జీడీపీ 19.10 లక్షల కోట్లతో దేశంలో మూడో స్థానంలో ఉంది. అయితే వన్ ట్రిలియన్ డాలర్ల ఎకనమీకి చేరుకోవాలంటే ఇంకా 79 లక్షల కోట్లను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితికి దాదాపు ఐదు రెట్లు అభివృద్ది చేయాల్సి ఉంది. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో చేరుకోగలరా అనేది ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా పెట్టుబడులు పెట్టాలంటే అందుకు అనుకూలంగా చట్టాలను సవరించాల్సి ఉంది. పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని వసతులూ అవసరమైతే పన్ను రాయితీలూ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు దనికి సంబంధించిన అన్ని అనుమతులతో పాటు ఏవైనా అడ్డంకులు వస్తే ఏమాత్రం జాప్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ పాలసీ 2022 ను రూపొందించింది. ఈ పాలసీ ప్రకారం రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సబ్సిడీలను నిర్ణయించింది. ఈ సబ్సిడీల్లో ఎక్కువభాగం బుందేల్‌ఖండ్, పూర్వాంచల్‌లో అత్యధికంగా ఉండగా మధ్యాంచల్, పశ్చిమాంచల్ తర్వాతి స్థానంలో, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్ జిల్లాలు చివరిస్థానంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం తరపున భారీ రాయితీలు లభిస్తాయి. దీంతో పాటు ఇదే పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక నోడల్ అధికారితో పాలసీ ఇంప్లిమెంట్ యూనిట్ ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ పెట్టుబడులను ఆకర్షించడం, వారికి ఎటువంటి అడ్డంకులూ కలగకుండా చూసుకోవడం, ఇన్సెంటివ్ లను ఇవ్వడం లాంటివాటిని ఈ యూనిట్ పర్యవేక్షిస్తుంది.

అయితే చట్టాల్లో మార్పులు, కొత్త కొత్త పాలసీలు చేస్తే పెట్టుబడులు వస్తాయే కానీ ఆశించినంత స్థాయిలో రావు. దీనికి రాష్ట్ర నాయకత్వం పటిష్టగా కృషి చేయాలి. ప్రతికూల పరిస్థితులను సైతం అవకాశాలుగా మలచుకోవాలి. ఈ విషయంలో యోగి ఆదిత్యనాథ్ పటిష్టంగానే పనిచేస్తున్నారు. ఇప్పటికే శాంసంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద మానుఫ్యాక్చరింగ్ హబ్ ను యూపీ నోయిడాలో స్థాపించింది. దాదాపు 35 ఎకరాల్లో 4 వేల 825 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. దీన్ని యూపీకి తీసుకురావడానికి యోగి ఆదిత్యనాథ్ ఎంతగానో కృషి చేశారు. అంతేకాదు, ఇప్పుడు భారత్ లో తయారవుతున్న మొబైల్ ఫోన్లలో 45 శాతం ఫోన్లు యూపీలోనే తయారవుతున్నాయి. ఈ విధంగా పెట్టుబడులే లేని యూపీని ఇండస్ట్రియల్ హబ్ గా మార్చడంలో కీలకంగా వ్యవహరించారు. యోగి పాలించిన ఐదేళ్ళలో యూపీలో దాదాపు 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు లభించాయి. ఇదే దూకుడుతో యూపీని మరో ఐదేళ్ళలో వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించేవిధంగా దూసుకెళుతున్నారు.

దీనికి ప్రపంచ పరిస్థితులు కూడా అనుకూలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రపంచ జీడీపీ మొత్తం క్షీణ దశలో ఉండగా ఒక్క భారత్ మాత్రమే ఆర్థికంగా వృద్ది చెందుతోంది. వరల్డ్ బ్యాంక్ తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భవిష్యత్తు భారత్ దే అని కొనియాడారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రపంచదేశాలన్నీ ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో రష్యా క్షీణిస్తుండగా ఇటు అమెరికా, యూరప్ దేశాలు తీవ్ర ఆర్థిక, చమురు సంక్షోభాల్లో చిక్కుకుంటున్నాయి. వీటితో పాటు ఇప్పుడు చైనా కూడా కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. ప్రపంచదేశాలన్నీ కోవిడ్ లాక్ డౌన్ల నుంచి బయటపడి సంవత్సరాలు గడుస్తున్నా కూడా చైనా మాత్రం ఇంకా లాక్ డౌన్ల దశలోనే ఉంది. తరచూ కొత్త వేరియంట్ లను చవిచూస్తూనే ఉంది. దీంతో స్థానికంగా ఉండే కంపెనీలకు ఇది ఎంతో ఇబ్బందికరంగా మారింది. తమ ఫ్యాక్టరీలు తరచూ మూతపడుతుండటం, పనిచేయడానికి ఉద్యోగులు రాకపోవడంతో చైనాలో ఉత్పత్తి పూర్తిగా క్షీణిస్తోంది. అయితే దీన్ని భారత్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. చైనాలోని కంపెనీలను భారత్ కు ఆకర్షించడం, వారికి సరైన రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడం వంటివి చేస్తున్నారు. దీంతో చైనా కంపెనీలన్నీ భారత్ కు క్యూ కడుతున్నాయి. వీటికి తోడు యూపీలో యోగీ ఆదిత్యనాథ్ మరిన్ని రాయితీలకు కల్పించడంతో మరిన్ని పెట్టుబడులు పెరిగే అవకాశం కనబడుతోంది. గతంలో కూడా కోవిడ్ సమయంలో చైనాలోని కంపెనీలను ఆకర్షించడానికి యూపీ సీఎం లేబర్ యాక్ట్ లలో సవరణ చేసి భారీగా పెట్టుబడులను ఆకర్షించాడు. దీంతో అప్పట్లో పలు కంపెనీలు చైనాను వదిలి నోయిడాలో పెట్టుబడులు పెట్టాయి.

ఈ విధంగా ఎప్పటికప్పుడు అవకాశాలను అనుకూలంగా మలచుకునే సామర్థ్యం యోగి ఆదిత్యనాథ్ కు ఉందనేది ఆర్థిక విశ్లేషకుల మాట. దీనికి తోడు ప్రపంచదేశాలన్నీ సంక్షోభంలో చిక్కుకుంటుండటంతో పెట్టుబడిదారులు కూడా భారత్ వైపు చూస్తున్నారు. కోవిడ్ తర్వాత అన్ని దేశాల ఆర్థిక స్థితి పడిపోయినా, భారత్ మాత్రం ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగింది. అయితే ఇది ఇప్పట్లో ఆగేది కాదని వరల్డ్ బ్యాంక్ కూడా అంచనా వేసింది. 2028 కల్లా భారత్ ప్రపంచంలో రెండవ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అంచనా వేసింది. దీన్ని యూపీ సీఎం కూడా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. తర్వాతి రోజుల్లో రాబోయే పెట్టుబడులన్నీ యూపీ వైపుకు దారిమళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జరిగితే దేశ జీడీపీలో యూపీ మొదటి స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 × three =