National

ఆక్సిజన్ సరఫరాలో మాక్ డ్రిల్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రి.. 22 మంది మృతి

ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోయిన సంగతి తెలిసిందే..! ఇందులో కొందరి నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకోగా.. కొన్నిసార్లు ఆక్సిజన్ ఉత్పత్తి లేక కూడా మరణాలు చోటు చేసుకున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం చేసిన పని వలన ఏకంగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం అత్యుత్సాహం కారణంగానే ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని తాజాగా బయటకు వచ్చింది.

ఆగ్రాలోని శ్రీ పరాస్ ఆసుపత్రి యాజమాన్యం ఆక్సిజన్ మాక్ డ్రిల్ చేసి.. 22 మంది ప్రాణాలను తీసిందని కథనాలు వచ్చాయి. ఏప్రిల్ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఆక్సిజన్ సరఫరాను ఐదు నిమిషాల పాటు ఆపేశామన్న ఆసుపత్రి యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ మాటలు స్పష్టంగా వినిపించాయి. మోదీనగర్ లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. పేషెంట్లను తీసుకువెళ్లాల్సిందిగా వారి కుటుంబ సభ్యులకు చెబుతున్నా వారు పట్టించుకోలేదు.. రోగుల కుటుంబాలకు కౌన్సిలింగ్ ప్రారంభించాం.. కొందరు తాము చెప్పింది వింటున్నారు.. ఇంకొందరు వెళ్లడానికి ఒప్పుకోవడం లేదు.. దీంతో నేను ‘మాక్ డ్రిల్’ లాంటి ఓ ప్రయోగం చేయాలనుకున్నా.. అనే మాటలు రికార్డు అయ్యాయి.

మాక్ డ్రిల్‌కు నేను అంగీకరించాను.. ఎవరు చనిపోతారో, ఎవరు బతికి ఉంటారో తెలుసుకుంటాం.. ఉదయం 7 గంటలకు ఇది నిర్వహించాం. ఏప్రిల్ 26న ఉదయం 7 గంటలకు ఆరోగ్యం విషమించిన 22 మంది రోగులకు ఆక్సిజన్ ను ఐదు నిమిషాల పాటు ఆపేశారు.. వాళ్ల శరీరాలు నీలి రంగులోకి మారడం మొదలవ్వడంతో.. ఇక వాళ్లు బతకడం కష్టమని చెప్పామని కూడా అరింజయ్ వీడియోలో చెప్తుండడం గమనించవచ్చు. మిగతా 74 మంది పేషెంట్ల కుటుంబ సభ్యులకు వెళ్లి ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకోవాలని చెప్పామని అరింజయ్ చెప్పినట్టు రికార్డయింది. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అరింజయ్ చెప్పారు. పరిస్థితి విషమించిన వారిని గుర్తించి మెరుగైన చికిత్స ఇచ్చేందుకే మాక్ డ్రిల్ చేశామని ఆయన వివరించారు. ఏప్రిల్ 26న నలుగురు, మర్నాడు మరో ముగ్గురు కరోనా పేషెంట్లు చనిపోయారన్నారు. 26న 22 మంది చనిపోయారా అన్న ప్రశ్నకు మాత్రం తనకు కచ్చితమైన సంఖ్య లేదని తెలిపారు. ఈ ఆడియో సంచలనంగా మారడంతో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఆసుపత్రిలో, ఏప్రిల్ 26, 27 తేదీలలో ఏడు కోవిడ్ మరణాలు సంభవించాయనీ, ఈ వీడియోపై దర్యాప్తు చేయనున్నామని ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − 1 =

Back to top button