More

    యూపీలో మదర్సాలకు కొత్త సూచనలు.. ఇతర రాష్ట్రాలలో కూడా తీసుకుని వస్తే..?

    ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని గుర్తింపు లేని మదర్సాలకు సంబంధించి సర్వేను నిర్వహించి.. ఉపాధ్యాయుల సంఖ్య, చెబుతున్న పాఠాలు, అక్కడ అందుబాటులో ఉన్న ప్రాథమిక సౌకర్యాల గురించి సమాచారాన్ని సేకరించనుంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) నిబంధనల మేరకు మదర్సాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు యూపీ రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందని మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి డానిష్‌ ఆజాద్‌ అన్సారీ బుధవారం తెలిపారు. ఈ సర్వే త్వరలో ప్రారంభం కానుందని మంత్రి మీడియాకి తెలిపారు.

    సర్వే సందర్భంగా మదర్సా పేరు, దానిని నిర్వహిస్తున్న సంస్థ, ప్రైవేట్ లేదా అద్దె భవనంలో నడుస్తోందా, అక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నట్లు అన్సారీ తెలిపారు. మదర్సాలోని ఉపాధ్యాయుల సంఖ్య, దాని పాఠ్యాంశాలు, ఆదాయ వనరు, ఏదైనా ప్రభుత్వేతర సంస్థ (NGO)తో అనుబంధం వంటి సమాచారాన్ని కూడా సేకరించనున్నారు. ప్రస్తుతం గుర్తింపు లేని మదర్సాల సమాచారాన్ని మాత్రమే సేకరించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

    ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 16,461 మదర్సాలు ఉండగా, అందులో 560 మదర్సాలకు ప్రభుత్వ గ్రాంట్లు ఇచ్చింది. రాష్ట్రంలో గత ఆరేళ్లుగా కొత్త మదర్సాలను జాబితాలో చేర్చలేదు. బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మదర్సాలలో వివాదాస్పద వ్యక్తులు ఉన్నా, ఇతర వ్యక్తులు ఉన్నా సమాచారం ఇవ్వాలని.. అక్కడ జరిగే నియామకాల గురించి స్పష్టమైన సమాచారం ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ఎయిడెడ్ మదర్సాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని నియమించుకునే విషయంపై కూడా పలు సూచనలు చేశారు. రాష్ట్ర మదర్సా ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ఆమోదంతో నియామకాలు, కారుణ్యనియామకాలు చేపట్టాల్సి ఉంటుందని అన్సారీ చెప్పారు. మదర్సాలలో పనిచేసే మహిళా ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ప్రసూతి సెలవులు, శిశు సంరక్షణ సెలవులు కూడా లభిస్తాయన్నారు. టీచర్స్ అసోసియేషన్ మదారిస్ అరేబియా ప్రధాన కార్యదర్శి దివాన్ సాహెబ్ జమాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించారు. ఈ నిర్ణయాలు మదర్సా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ప్రయోజనం చేకూరుస్తాయని అన్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories