More

    యూపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల.. లవ్ జిహాద్ కు పాల్పడితే 10 సంవత్సరాల జైలు శిక్ష

    దేశ ప్రజలు అత్యంత ఆసక్తికరంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల వైపు చూస్తూ ఉన్నారు. ఎలాగైనా యోగి ఆదిత్యనాథ్ సర్కారును కిందకు దించాలని ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇక ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించడానికి అతి ముఖ్యమైనది మేనిఫెస్టో..! యూపీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుద‌ల చేసింది. మంగళవారం ఉదయం అమిత్ షా, ఇతర నాయకుల సమక్షంలో ‘లోక్ కళ్యాణ్ సంకల్ప్ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఐదేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిందని.. ఇంకా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. వచ్చే ఐదేళ్లలో రైతులకు సాగునీటికి ఉచిత కరెంటు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. రూ.5 వేల కోట్లతో ముఖ్యమంత్రి కృషి సించాయి యోజనను ప్రారంభిస్తామని.. దీని కింద చిన్న, సన్నకారు రైతులందరికీ బోర్‌వెల్, గొట్టపు బావి, చెరువు, ట్యాంకుల నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. కన్యా సుమంగళ యోజన కింద ఆర్థికసాయం 15 వేల నుంచి 25 వేలకు పెంచుతామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉజ్వల పథకం కింద హోలీ, దీపావళి నాడు లబ్దిదారులందరికీ ఉచితంగా ఎల్‌పిజి సిలిండర్లు అందజేస్తామన్నారు. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రజా రవాణాలో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామ‌ని, వితంతువులు, నిరుపేద మహిళలకు నెలకు రూ.1500ల‌కు పింఛను పెంచుతామని హామీ ఇచ్చారు. కాలేజీకి వెళ్లే ప్రతిభావంతులైన బాలికల స్వావలంబనకు రాణి లక్ష్మీ బాయి పథకం కింద ఉచిత స్కూటీలను పంపిణీ చేస్తామని చెప్పారు. రాబోయే 5 సంవత్సరాలలో ప్రతి కుటుంబానికి కనీసం ఉపాధి లేదా స్వయం ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగ‌ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని.. స్వామి వివేకానంద యువ సశక్తికరణ్ యోజన కింద.. 2 కోట్లు టాబ్లెట్‌లు లేదా స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో జిమ్‌లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని, ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మొదటి స్థానానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

    పార్టీ అధికారంలోకి వస్తే “లవ్ జిహాద్”కు పాల్పడిన వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1 లక్ష జరిమానా విధిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. మతమార్పిడి నిరోధక చట్టాలను రూపొందించిన అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. ప్రస్తుత చట్టం ప్రకారం బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే రూ.15,000 జరిమానాతో ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన 212 వాగ్దానాలలో 92% ఆదిత్యనాథ్ ప్రభుత్వం నెరవేర్చిందని అమిత్ షా పేర్కొన్నారు. ఏది చెబితే అదే చేయడం బీజేపీ సంస్కృతి అని ఆయన అన్నారు.

    Trending Stories

    Related Stories