కేంద్ర మంత్రి తింటుండగానే లాక్కెళ్లిన మహారాష్ట్ర పోలీసులు.. బెయిల్ మంజూరు..!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను మంగళవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా రత్నగిరి జిల్లాలో ఉన్న రాణేను పోలీసులు కస్టడీలోకి తీసుకుని సంగమేశ్వర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. నాసిక్ శివసేన అధ్యక్షుడు ఫిర్యాదుతో రాణేపై ఐపీసీ సెక్షన్లు 500 (పరువు నష్టం), 505(2) (దుశ్చేష్ట), 153-బీ(1)(సీ) (ద్వేషపూరిత వ్యాఖ్యలు) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన తింటుండగానే మహారాష్ట్ర పోలీసులు లాక్కెళ్లిన వీడియో బయటకు వచ్చింది. తనకు బీపీ, షుగర్ పెరిగిపోయాయని రాణే ఆందోళన వ్యక్తం చేయడంతో వైద్య పరీక్షలు చేయించారు. మగళవారం రాత్రి రాయగఢ్ జిల్లా మహడ్లోని కోర్టులో రాణేను పోలీసులు హాజరుపర్చారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాణే అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని, ఆయన అనారోగ్యం దృష్ట్యా బెయిలు మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. పరిశీలించిన న్యాయస్థానం రాణేకు బెయిలు మంజూరు చేసింది.

‘దేశానికి స్వాతంత్య్రం ఏ సంవత్సరంలో వచ్చిందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు. ఆయన ప్రసంగాన్ని మధ్యలో ఆపి వెనుక ఉన్నవారిని అడగాల్సి వచ్చింది. నేను అక్కడ ఉండి ఉంటే (ఆయన) చెంప పగులగొట్టేవాడిని’ అని రాణే వ్యాఖ్యానించారు. సోమవారం రాయగఢ్ జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని రాణే ఇంటిని శివసేన కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా వారికి, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. అమరావతిలో బీజేపీ కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు.
మహారాష్ట్రలో పలుచోట్ల తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను సవాల్ చేస్తూ రాణే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనను ఆరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. వెంటనే విచారణ చేపట్టడానికి కోర్టు నిరాకరించింది. రాణేను అరెస్టు చేయడం రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడమేనని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అరెస్టుపై ప్రజాస్వామికంగా పోరాడుతామని చెప్పారు. గత 20 సంవత్సరాలలో ఒక రాష్ట్ర పోలీసులు కేంద్ర మంత్రిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి. 69 సంవత్సరాల రాణే… శివసేనలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రేకు నమ్మకస్తుడిగా మెలిగారు. ఠాక్రేలతో విభేదాలతో 2005లో రాణేను బహిష్కరించడంతో ఆయన కాంగ్రెస్లో చేరారు. 2019లో బీజేపీ కండువా కప్పుకున్నారు. జూలైలో కేంద్ర క్యాబినెట్లో చోటు లభించింది. రాణే అరెస్టు రాజకీయ కక్షతోనే అని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.