More

    మహిళలకు మరో శుభవార్త చెప్పిన మోదీ ప్రభుత్వం

    మహిళలకు ఉచితంగా వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెపింది. G20 సమావేశాలు విజయవంతంగా జరగడంతో ప్రధాని మోదీని, దేశ ప్రజలను కేంద్ర కేబినెట్‌ అభినందించింది. ఇక మహిళలకు గుడ్ న్యూస్ చెబుతూ ఉజ్వల పథకం కింద మరిన్ని కనెక్షన్స్ ఇవ్వడానికి సిద్ధమైంది కేంద్రం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకంలో భాగంగా అదనంగా 75 లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే మూడేళ్లలో లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లను అందజేసేందుకుగాను రూ.1650 కోట్లను కేటాయించింది. ఈ మేరకు పీఎంయూవై పథకం పొడిగింపునకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

    అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఉజ్వల పథకం కింద ఇప్పటి వరకు 9.60 కోట్ల LPG సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. ఈ విషయాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని, మరో 75 లక్ష ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి మార్చి 2026 కల్లా రూ.1650 కోట్ల వ్యయంతో అదనంగా 75 లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లను అందజేయనున్నట్లు తెలిపారు. దీంతో ఉజ్వల పథకం మొత్తం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరనుంది. ఇంతకు ముందు 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ రూ.1,150కు పైగా పలుకగా.. కేంద్రం ఇటీవల గ్యాస్‌ ధరలను రూ.200 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఉజ్వల పథకాన్ని 2016 మేలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు.

    న్యాయ వ్యవస్థలో సాంకేతికతను మెరుగుపర్చడానికి ఉద్దేశించిన ‘ఈ-కోర్టుల ప్రాజెక్టు’ మూడో దశకు రూ.7210 కోట్లను కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు అనురాగ్ ఠాకూర్ చెప్పారు. జాతీయ ఇ-గవర్నెన్స్‌ ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ-కోర్టుల ప్రాజెక్టును 2007 నుంచి అమలు చేస్తున్నారు.

    Related Stories