ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదాను రూపొందించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని ధామి తెలిపారు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ “ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, కొత్త బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదాను సిద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రజలందరికీ వారి విశ్వాసంతో సంబంధం లేకుండా వివాహాలు, విడాకులు, భూమి-ఆస్తి, వారసత్వానికి సంబంధించిన ఒకే విధమైన చట్టాలను ఈ యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదా అందిస్తుంది” అని అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదా కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ తరహా కోడ్‌ను అమలు చేయడం వల్ల ఉత్తరాఖండ్ లో ప్రతీ ఒక్కరికీ సమాన హక్కులు కలుగుతాయని చెప్పుకొచ్చారు. ఇది సామాజిక సామరస్యాన్ని పెంపొందించడమే కాకుండా మహిళా సాధికారత బలోపేతానికి దోహదపడుతుందన్నారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ “మా దేవభూమి, ఉత్తరాఖండ్, 1.3 కోట్ల మంది పౌరులకు నిలయం. దేశానికి, మన నాగరికతకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. జాతీయ భద్రతలో రాష్ట్రం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది 2 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. అందువల్ల ఉత్తరాఖండ్‌లోని భౌగోళిక, రాజకీయ అంశాలు దేశం మొత్తం జాతీయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. సాంస్కృతిక, పర్యావరణ, జాతీయ భద్రత అన్ని విభిన్న కోణాల్లో, ఉత్తరాఖండ్ దేశానికి కీలకమైన వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రాష్ట్రం. బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన వెంటనే ఏకరూప పౌర నియమావళికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేయడానికి వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా, కుటుంబ చట్టం, ఆస్తి చట్టం తదితర అంశాల్లో మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఏకరీతి చట్టపరమైన మద్దతును అందించడానికి ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తుంది.” అని అన్నారు.