More

    75 వేల మంది లబ్దిదారులకు ఇళ్లను అందించిన ప్రధాని మోదీ

    భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న అర్బ‌న్ ప‌థ‌కం’ కింద ఇవాళ సుమారు 75 వేల మంది ల‌బ్ధిదారుల‌కు ఇళ్లను అంద‌జేశారు. ప్రధాని మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని 75 జిల్లాల్లో ఉన్న ల‌బ్ధిదారుల‌కు డిజిట‌ల్ రూపంలో ఇంటి తాళాల‌ను అందించారు. ఆ త‌ర్వాత వ‌ర్చువ‌ల్ రీతిలో ఆయ‌న ఆ స్కీమ్ ల‌బ్ధిదారుల‌తో మాట్లాడారు. ఇళ్లు పొందిన ఈ 75,000 మంది తమ కొత్త ఇంటిలో దీపావళి, దసరా మరియు ఈద్ జరుపుకుంటారని మోదీ అన్నారు. ఇస్తున్న ఇళ్లలో 80 శాతం ఇళ్లు మహిళల పేరిట ఉన్నందుకు సంతోషంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2014 తర్వాత, మా ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పలు నగరాల్లో 1.13 కోట్లకు పైగా గృహాలను నిర్మించడానికి అనుమతి ఇచ్చిందని అన్నారు. వీటిలో 50 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించబడ్డాయి.. పేదలకు ఇవ్వబడ్డాయని ఆయన చెప్పారు.

    “ఉత్తర ప్రదేశ్‌లోని గత ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్లు నిర్మించడానికి ఇష్టపడలేదు. 2017 కి ముందు, UP లో PM ఆవాస్ యోజన కింద రూ .18,000 కోట్లు ఆమోదించబడింది. కానీ 18 ఇళ్లను కూడా నిర్మించలేదు, యోగి ప్రభుత్వం 9 లక్షల ఇళ్లను నిర్మించింది” అని మోదీ అన్నారు. “మురికివాడల్లో నివసిస్తున్న వారికి, పక్కా ఇళ్లు లేని 3 కోట్ల కుటుంబాలకు ఒకే పథకంతో లక్షాధికారులుగా మారడానికి అవకాశం లభించింది. ఈ వ్యక్తులు ఇప్పుడు లక్షాధికారులు” అని లక్నోలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    ల‌క్నోలో అర్బ‌న్ స‌ద‌స్సును నిర్వ‌హించ‌డం ఈ న‌గ‌రానికి వ‌న్నె తెచ్చిన‌ట్లు అవుతుంద‌ని మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఇండియాను కొత్త‌గా చూడాల‌న్న క‌ల ప్ర‌ధానికి ఉంద‌ని, దాని కోసం ఆయ‌న నిరంత‌రంగా శ్ర‌మిస్తున్నార‌ని, భార‌త్ కూడా ఆయ‌న ఆశించిన మార్పును గ‌మ‌నిస్తున్న‌ట్లు రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు.

    ల‌క్నోలోని ఇందిరా గాంధీ ప్ర‌తిష్టాన్‌లో ట్రాన్స్‌ఫార్మింగ్ అర్బ‌న్ ల్యాండ్‌స్కేప్ ఎక్స్‌పో నిర్వ‌హించారు. ఆ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ పాల్గొన్నారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురి, యూపీ గ‌వ‌ర్న‌ర్ ఆనందిబెన్ ప‌టేల్‌, యూపీ సీం యోగి ఆదిత్య‌నాథ్‌లు పాల్గొన్నారు. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద 17.3 ల‌క్ష‌ల ఇళ్లను మంజూరు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 8.8 ల‌క్షల మంది ల‌బ్ధిదారుల‌కు ఇళ్లను అంద‌జేసిన‌ట్లు కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్ తెలిపారు.

    Trending Stories

    Related Stories