More

    పాక్ చేరిన ఇంగ్లండ్ బృందానికి వైరల్ ఇన్ఫెక్షన్.. కోలుకుంటేనే ఈరోజు మ్యాచ్..!

    డిసెంబర్ 1 నుంచి పాకిస్థాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టులో ఆటగాళ్లు అనారోగ్యానికి గురవ్వడం కలకలం రేపుతోంది. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో సహా జట్టులోని 14 మంది సభ్యులకు గుర్తు తెలియని వైరస్‌ సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో నేడు రావల్పిండిలో టెస్ట్ మ్యాచ్ జరిగేది అనుమానంగా మారింది. ప్రస్తుతం ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు.

    ఈరోజు మ్యాచ్ మొదలవ్వడం అనుమానమే:
    ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ గురువారం నుంచి రావల్పిండిలో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అని కొందరు ప్రచారం చేస్తుండగా, ఫ్లూ లాంటి వైరస్ బారిన పడ్డట్లు మరికొందరు చెబుతున్నారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈరోజు చర్చించాయి. గురువారం మ్యాచ్ మొదలుకాకపోతే శుక్రవారానికి వాయిదా వేయడానికి రెండు క్రికెట్ బోర్డులు ఏకగ్రీవంగా అంగీకరించాయి. రెండు బోర్డులు ఇంగ్లండ్ వైద్యుల వైద్య సలహా ఆధారంగా నిర్ణయం తీసుకున్నాయి, ఇది ఆటగాళ్ల ఆరోగ్యం, సంక్షేమం చుట్టూ తిరుగుతుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు గురువారం ఉదయం మైదానంలోకి వచ్చేంతగా కోలుకోకపోతే.. ఆ తర్వాత టెస్ట్ శుక్రవారం ప్రారంభమవుతుంది. ఐదు రోజుల మ్యాచ్ నిర్వహిస్తారు. ముల్తాన్‌లో జరిగే రెండవ టెస్ట్ మరియు కరాచీలో జరిగే మూడవ టెస్ట్ షెడ్యూల్ ప్రభావితం అవ్వదని పీసీబీ తెలిపింది.

    Trending Stories

    Related Stories