More

  తీస్తా, జుబేర్ అరెస్ట్‎పై ఐరాస హైరానా..! వీళ్లకెందుకు అంత ఆందోళన..?

  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడరు కానీ ఆర్టికల్ 370 రద్దుపై హైరానా పడుతుంటారు. పాకిస్తాన్ చేసే పాపాల గురించి ప్రస్తావించరు కానీ కశ్మీర్ పై కంగారు పడుతుంటారు. దేశ భక్తులను కాపాడరు కానీ దేశ ద్రోహులను రక్షించే ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి దేశానికి భారత్ లో ఏం జరిగినా తమకేదో జరిగిపోయినట్లు తెగ ఆందోళన చెందడం అలవాటుగా మారిపోయింది.

  భారత్ సొంత విషయాల్లో జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఆఖరికి ఐక్యరాజ్య సమితి కూడా భారత్ అంతర్గత విషయాల్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎవరు దేశ ద్రోహులో..? ఎవరు దేశ భక్తులో భారత్ కు తెలీదా..? ఎవరిని ఎక్కడ పెట్టాలో భారత్ కు బాగా తెలుసు. అందుకే దేశానికి నష్టం జరుగుతుందంటే ఎలాంటి చర్యలకైనా కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందుకే సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాకుడు మొహమ్మద్‌ జుబైర్‌ లను సమగ్ర దర్యాప్తు తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసింది.

  అయితే 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసులో బాధితుల తరఫున న్యాయపోరాటం చేసిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ను గుజరాత్ ఏఠీఎస్ అరెస్టు చేసింది. ఆమె అరెస్టు కక్షసాధించేనంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఐరాస మానవ హక్కుల విభాగం కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. హక్కులు కాపాడుకోవడం నేరమేమీ కాదని తెలిపింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది.

  సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మరో ఇద్దరు వ్యక్తుల్ని భారత్ లో పోలీసులు ఇటీవల అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం చేసిన వ్యాఖ్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తప్పుబట్టింది. ఐరాస మానవ హక్కుల అధికారి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని స్పష్టం చేసింది. అలాగే భారతదేశ స్వతంత్ర న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకునేలా ఉన్నాయని తెలిపింది. భారతదేశంలోని అధికారులు చట్ట ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఏర్పాటు చేయబడిన న్యాయ ప్రక్రియలకు అనుగుణంగా వ్యవహరిస్తారని వెల్లడించింది. అటువంటి చట్టపరమైన చర్యలను క్రియాశీలత కోసం హింసగా పేర్కొనడం తప్పుదారి పట్టించేదని.. ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది.

  అలాగే జర్నలిస్టు, ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాకుడు మొహమ్మద్‌ జుబైర్‌ అరెస్టుపై అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. పాత్రికేయులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వాతావరణం ఉండాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. వారు వ్యక్తపరిచిన విషయాలపై వారిని జైలు పాలు చేయొద్దని సూచించారు. ఈ ప్రపంచంలో ఏ ప్రదేశంలో అయినా ప్రజలు తమ భావాలను వ్యక్తపరిచేందుకు తగిన వాతావరణం ఉండాలన్నది తన అభిప్రాయమన్నారు. వారి రాతలు, ట్వీట్లు, మాటలపై పాత్రికేయుల్ని జైల్లో పెట్టకూడదని హితవు పలికారు.

  ఇక జుబైర్ అరెస్టును కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్‌ తీవ్రంగా ఖండించింది. ఈ అరెస్టు.. భారత్‌ పత్రికా స్వేచ్ఛ కనిష్ఠ స్థాయిని సూచిస్తోందని వెల్లడించింది. మతపరమైన సమస్యలపై రిపోర్టింగ్‌ చేసే సభ్యులకు ప్రభుత్వం సురక్షితంగా లేని, ప్రతికూల వాతావారణాన్ని సృష్టించిందంటూ విమర్శించింది. జుబైర్‌ గతంలో చేసిన ఓ ట్వీట్‌ ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న అభియోగాలపై ఆయన్ను ఇటీవల దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విటర్‌ వినియోగదారుడొకరు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నారు. అయితే సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాకుడు మొహమ్మద్‌ జుబైర్‌ ల అరెస్ట్ ను ఖండిస్తున్న ఐరాస, ఇతర దేశాలు.. భారత్ లో వర్గం సృష్టిస్తున్న అరాచకాలపై ఎందుకు స్పందించదు..? ఎందుకు ఖండించదు..? నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ప్రపంచం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది కానీ.. అదే నుపుర్ శర్మను సపోర్టు చేసిన ఓ టైలర్ ను పట్టపగలు అతి దారుణంగా హత్య చేస్తే ఎందుకు స్పందించరు..? తమకు అనుకూలమైన విషయాలపైనే మాట్లాడుతారు కానీ మిగతా విషయాలపై ఎందుకు మౌనం అంటూ దేశభక్తులు ప్రశ్నిస్తున్నారు.

  spot_img

  Trending Stories

  Related Stories