
బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రభుత్వంలో ప్రధాని బోరిస్ జాన్సస్‌పై గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి బహిర్గతమవుతోంది. ప్రభుత్వంలో పెరుగుతున్న అవినీతిని నిరసిస్తూ ఇప్పటికే ఇద్దరు కీలక మంత్రులు రాజీనామా చేయగా, తాజాగా మరో ఇద్దరు తమ రాజీనామాలను ప్రధానికి పంపించారు.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఉన్న బ్రిటన్‌లో తాజాగా రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రి, భారతీయ మూలాలున్న రిషి సునక్, వైద్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వంపై వస్తున్న పలు అవినీతి ఆరోపణలు, ఇతర కుంభకోణాలపై బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలోకి పలువురు మంత్రుల్లో తీవ్ర నిరసన నెలకొంది. దాంతో పాటు, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీకి పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవిని అప్పగించడంతో వారిలో ఆగ్రహం మరింత పెరిగింది. వెంటనే, ఈ కుంభకోణాలకు నిరసనగా రాజీనామా చేస్తున్నామని రిషి సునక్, సాజిద్ జావిద్ తమ రాజీనామా లేఖల్లో తెలిపారు. తాజాగా, జాన్సన్ మంత్రివర్గం నుంచి శిశు, కుటుంబ వ్యవహారాల మంత్రి విల్ క్విన్స్, రవాణా శాఖ సహాయ మంత్రి లారా ట్రాట్ కూడా వైదొలగారు. రాజీనామా చేయడం మినహా మరో ప్రత్యామ్యాయం లేదని తన రాజీనామా లేఖలో విల్‌క్విన్స్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని లారా విమర్శించారు. ఈ నలుగురే కాకుండా, బోరిస్ జాన్సన్ టీమ్ నుంచి దాదాపు 10 మంది వరకు సహాయ మంత్రులు, ఇతర కీలక శాఖల బాధ్యులు వైదలగారు. అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందని వారు ఆరోపించారు.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీకి పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించడంపై బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పారు. ఇద్దరు పురుషులను లైంగికంగా ఇబ్బంది పెట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పార్టీ సంక్షేమం, క్రమశిక్షణ బాధ్యతలు అప్పగించడమేంటని జాన్సన్‌పై పార్టీ ముఖ్య నేతలు కూడా మండిపడ్డారు. దాంతో, ఆ నియామకాన్ని రద్దు చేసిన జాన్సన్, బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్పిన కాసేపటికే రిషి సునక్, సాజిద్ జావిద్‌లు రాజీనామా చేయడం గమనార్మం. బోరిస్ నాయకత్వలో పరిస్థితిలో మెరుగైన మార్పు వస్తుందని ఆశించడం లేదని… ఆయనపై ప్రజలతో పాటు తాను కూడా విశ్వాసం కోల్పోయానని.. అందుకే ఈ రాజీనామా చేస్తున్నట్లు తన రిజిగ్నేషన్ లెటర్‌లో జావిద్ చెప్పారు.
రిషి, జావిద్‌ల రాజీనామా ప్రభావం జాన్సన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ ప్రభుత్వంపై తీవ్రంగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న క్రిస్ పించర్ వ్యవహారం జాన్సన్ ప్రభుత్వానికి ముప్పు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. గత నెలలోనే అవిశ్వాస తీర్మానాన్ని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం అతికష్టం మీద గట్టెక్కింది. 2019లో ఒక ప్రైవేట్ క్లబ్‌లో ఇద్దరు పురుషులను లైంగికంగా ఇబ్బంది పెట్టాడని కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ క్రిస్ పించర్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై విచారణ కూడా జరిగింది. అయితే, తాజాగా, ఆ ఎంపీని పార్టీలో కీలక పదవిలో బోరిస్ జాన్సన్ నియమించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో క్రిస్ పించర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల విషయం తనకు తెలియదని వివరణ ఇచ్చారు. అయితే, ఆ విషయం తనకు తెలుసని, తెలియదని అబద్ధాలు చెబుతున్నారని సాక్ష్యాధారాలతో రుజువైంది. దాంతో, తప్పనిసరి పరిస్థితుల్లో జాన్సన్ క్షమాపణ చెప్పారు. పొరపాటున ఆ ఎంపీని ఆ పదవికి ఎంపిక చేశానని వివరణ ఇచ్చారు.