రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుధీర్ఘంగా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో రష్యా బలగాల చొరబాటును అడ్డుకునేందుకు సాధారణ పౌరులు సైతం ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఘటనలు ఉన్నాయి. యుద్ధ ట్యాంకులకు ఎదురుగా వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి.
ఇదేవిధంగా కీవ్ శివారు ప్రాంతానికి చెందిన ఆండ్రీ పోక్రాసా అనే 15 ఏండ్ల బాలుడు దేశం కోసం హీరోయిజం ప్రదర్శించాడు. తండ్రి సాయంతో తన వద్ద ఉండే చిన్న బొమ్మ డ్రోన్ సాయంతో నగరం వైపు దూసుకొస్తున్న రష్యా యుద్ధ ట్యాంకులకు సంబంధించి ఫొటోలు, అవి ఉన్న లోకేషన్ల సమాచారాన్ని ఉక్రెయిన్ సైన్యానికి అందించేవాడు. తామిచ్చిన సమాచారం 20 రష్యా ట్యాంకులను ధ్వంసం చేయడంలో ఉక్రెయిన్ సైన్యానికి సహకరించిందని ఆండ్రీ చెబుతున్నాడు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల చివరికి మొత్తం 40 వేల మంది సైనికులను రష్యా కోల్పోతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘డాన్‌బాస్‌లో రష్యా ఆర్మీ బలగాలను మోహరించాలని ప్రయత్నిస్తున్నది. ఏ బలగాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు? యుద్ధంలోకి శిక్షణ సరిగ్గా పొందని వారిని పంపిస్తున్నది. దొంగ దారిన నియమించిన వారిని కూడా పంపుతున్నది. కేవలం మా బలగాల కన్నా ఎక్కువ మంది ఉండాలనే ఉద్దేశంతోనే వారిని పంపుతున్నది. అంతేకానీ వారికి ఎలాంటి యుద్ధ ప్రావీణ్యం లేదు’ అని వివరించారు. ఉక్రెయిన్ భద్రతా బలగాలు తమ దేశంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు.