ఆఫ్గనిస్తాన్ కాబూల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన విమానం హైజాక్‌కు గురైందనే వార్తలు వచ్చాయి. గుర్తుతెలియని దుండగులు ఈ విమానాన్ని హైజాక్ చేశారని చెబుతుండగా.. ఇది తాలిబాన్ల పనేనా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. తమ దేశానికి చెందిన విమానం హైజాక్ అయినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. హైజాక్ చేసిన విమానాన్ని దుండగులు ఇరాన్‌కు తరలించినట్లుగా తమ వద్ద సమాచారం ఉన్నదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి యెవ్జెనీ యెనిన్ తెలిపారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్‌లో ఉన్న తమ పౌరులను తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో హైజకర్లు ఉక్రెయిన్ విమానాన్ని హైజాక్ చేసి ఇరాన్‌కు మళ్లించారని కథనాలు వస్తున్నాయి.
ఉక్రేనియన్ విమానాన్ని గుర్తుతెలియని వ్యక్తులు హైజాక్ చేసి ఇరాన్ తీసుకెళ్లినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్ కూడా చెప్పుకొచ్చింది. కొద్ది మంది సాయుధులు విమానాన్ని హైజాక్ చేసి ఇరాన్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తున్నదని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీ యెనిన్ చెప్పారు. ఆదివారం నాడు మా విమానం కాబూల్‌లో హైజాక్‌కు గురైంది. మా నుంచి గుర్తుతెలియని దుండగులు విమానాన్ని దొంగిలించారు. ఉక్రేనియన్లను ఎయిర్‌లిఫ్టింగ్ చేయడానికి పంపిన ఈ విమానాన్ని తమ వారితో నింపుకుని ఇరాన్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఉక్రేనియన్లను తరలించేందుకు మరో విమానాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని యెవ్జెనీ యెనిన్ తెలిపారు. పలు దేశాలు తమ దేశాలకు చెందిన వారిని ఆఫ్ఘనిస్తాన్ నుండి స్వదేశాలకు తీసుకుని వచ్చే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇలాంటి సమయంలో హైజాక్ వార్తలు రావడం పలు దేశాలను కలవరపెడుతూ ఉన్నాయి.