రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు ఐదు నెలలు కావస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క అంశంపైనా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. ఇప్పుడు 150 రోజుల తర్వాత, ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం తర్వాత నల్ల సముద్రం నుండి ధాన్యం ఎగుమతి కొనసాగించడానికి రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి.
ఈ ఒప్పందంతో ధాన్యంతో కూడిన ఉక్రెయిన్ నౌకలను రష్యా ఇకపై ఆపదు. దీనివల్ల ప్రపంచంలో పెరుగుతున్న ఆహార సంక్షోభాన్ని నివారించవచ్చని భావిస్తున్నారు. టర్కీలోని డోల్మాబాచ్ ప్యాలెస్‌లో ఇరు దేశాల మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ రజబ్ ఎర్డోన్ కూడా పాల్గొన్నారు. ఈ ఒప్పందం ఉక్రెయిన్ నుంచి ఆహార పదార్థాల ఎగుమతికి మార్గం లభించిందని సమావేశం అనంతరం గుటెర్రెస్ తెలిపారు.
దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆహార, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఉక్రెయిన్‌లోని అనేక ముఖ్యమైన స్థావరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. వీటిలో నల్ల సముద్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇది కాకుండా, రష్యా ఉక్రెయిన్‌లోని అనేక ముఖ్యమైన ఓడరేవులను స్వాధీనం చేసుకుంది. కొన్నింటిపైనా ఇంకా దాడి చేస్తూనే ఉంది. అటువంటి పరిస్థితిలో, ఉక్రెయిన్ నుండి ఆహార ధాన్యాల ఎగుమతి సుమారు ఐదు నెలలుగా ఆగిపోయింది. ఈ ప్రతిష్టంభనను ముగించేందుకు, రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు ప్రారంభించాలని యూఎన్, టర్కీ పట్టుబట్టాయి. యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల, ప్రపంచ వ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలను ట్రాక్ చేసే అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ ఆహార ధరల సూచిక మార్చిలోనే దాని ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే మొత్తం 32 ఏళ్లలో ఆహార పదార్థాల ధరలు అత్యధికంగా నమోదయ్యాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కైవ్ నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి.
మరోవైపు రష్యాపై పాశ్చాత్య దేశాలు విపరీతమైన ఆంక్షలు విధించాయి. దీంతో ఉక్రెయిన్‌తో పాటు రష్యా నుంచి కూడా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. చాలా దేశాలు రష్యా నుండి ప్రత్యక్ష కొనుగోళ్లను ఆపేశాయి. అటువంటి పరిస్థితిలో, ఆహార ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. ఆహార ధాన్యాల ఎగుమతి విషయంలో ఈ రెండు దేశాలు పవర్‌హౌస్‌లు. ఈ రెండు దేశాలు ప్రపంచంలోని గోధుమ అవసరాలలో 24 శాతాన్ని తీరుస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, రష్యా-ఉక్రెయిన్ ప్రపంచంలోని సన్‌ఫ్లవర్ ఆయిల్ అవసరాలలో 57 శాతం కూడా తీరుస్తుంది. ఐక్యరాజ్యసమితి కామ్‌ట్రేడ్ ప్రకారం, 2016 నుండి 2020 వరకు ప్రపంచంలోని మొక్కజొన్న ఎగుమతుల్లో 14 శాతానికి ఈ రెండు దేశాలు కూడా బాధ్యత వహించాయి. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఎగుమతులలో వెనుకబడి ఉన్నాయి. చాలా దేశాలు ఈ ఆహార పదార్థాల కొరతను ఎదుర్కొన్నాయి. తాజా ఒప్పందంతో ఇరు దేశాలు ఆ కొరతను తీర్చనున్నాయి.
యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లోనే మిలియన్ల టన్నుల గోధుమ నిలిచిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడింది. పేద దేశాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రెండు దేశాలు నేరుగా ఒప్పందంపై సంతకం చేయలేదు. ఇస్తాంబుల్‌లో జరిగిన కార్యక్రమంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ, ఉక్రెయిన్ మంత్రి ఒలెగ్జాండర్ కుబ్రకోవ్‌లు వేర్వేరుగా ఒప్పందంపై సంతకం చేశారు. అయితే ఎగుమతులు ఆగిపోవడంతో గోధుమతో తయారయ్యే బ్రెడ్, పాస్తా ధరలు పెరిగాయి. వంట నూనెలు, ఫెర్టిలైజర్ల ధరలు కూడా పెరగడం వల్ల చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం మైనింగ్ ఉన్న నీటిలో కార్గో షిప్‌లకు ఉక్రెయిన్ నౌకలు రక్షణ ఇవ్వనున్నాయి. అన్ని నౌకలను టర్కీ తనిఖీ చేయనున్నది. రష్యాకు చెందిన గోధుమ, ఫెర్టిలైజర్లను కూడా నల్ల సముద్రం ద్వారా ఎగుమతి చేయనున్నారు. నల్ల సముద్రంపై ఆశాకిరణం వెలిసిందని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు.