ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకుని రావడానికి ‘ఆపరేషన్ గంగా’ ను భారత్ చేపట్టిన సంగతి తెలిసిందే..! పోలాండ్, స్లోవేకియా, హంగేరి, రొమేనియా వంటి పొరుగు దేశాల ద్వారా భారతీయులను తరలించడానికి భారతదేశం ఒక మెగా మిషన్‌ను చేపడుతోంది.
ఫిబ్రవరి 28న ఉక్రెయిన్ సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో, UNలోని భారత రాయబారి TS తిరుమూర్తి మాట్లాడుతూ “ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి సహాయం కోరే వారికి సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది.” అని తెలిపారు. గతంలో భారతదేశం సంక్షోభ సమయాల్లో పొరుగు దేశాల నుండి పౌరులను తరలించింది. కోవిడ్ సంక్షోభం మధ్య చైనా నుండి మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్ పౌరులను తరలించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతిలో పడినప్పుడు, అక్కడి నుండి నేపాలీ జాతీయులను తరలించడానికి భారతదేశం సహాయం చేసింది. విదేశీ పౌరులను తరలించడానికి భారతదేశం సహాయం చేస్తుందా అనే ప్రశ్నకు సమాధానంగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, “సూత్రప్రాయంగా, ఇతర దేశాలకు సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. మాకు ఏదైనా నిర్దిష్ట అభ్యర్థనలు వస్తే, దాన్ని బట్టి మా వైఖరి తెలియజేస్తాం” అని అన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తమ జాతీయులను తరలించేందుకు నేపాలీ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని సంప్రదించింది. నేపాల్ అభ్యర్థనపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పాకిస్తాన్, టర్కీ విద్యార్థులకు కూడా త్రివర్ణ పతాకం సహాయపడిందని భారతీయ విద్యార్థులు తెలిపారు. రొమేనియాలోని బుకారెస్ట్ నగరానికి చేరుకున్న భారతీయ విద్యార్థులు మాట్లాడుతూ, భారత జెండా తమకు సహాయపడిందని, అలాగే కొంతమంది పాకిస్తాన్, టర్కీ విద్యార్థులు కూడా వివిధ చెక్‌పోస్టులను భారత్ జెండా సహాయంతో సురక్షితంగా దాటారని విద్యార్థులు తెలిపారు. ఉక్రెయిన్‌ను వీడి సరిహద్దులకు చేరుకోవాలనుకునే భారత విద్యార్థులు మువ్వెన్నెల జెండా పట్టుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. భారత ప్రభుత్వం ఈ సూచన చేయగానే విద్యార్థులు వెంటనే మార్కెట్‌కు వెళ్లి మన జాతీయ పతాకంలోని మూడు రంగుల స్ప్రేలను కొనుగోలు చేశారు. ఆపై వాటిని వస్త్రంపై స్ప్రే చేసి జెండాలను రూపొందించారు.