‘ఐటీ ఆర్మీ’ ని సిద్ధం చేసిన ఉక్రెయిన్.. ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు మొదలు

0
861

రష్యా నుండి భారీ సైబర్-దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాను అడ్డుకోడానికి ఏకంగా ఒక ఐటీ ఆర్మీని సిద్ధం చేసింది. సైబర్ సవాళ్లను ఎదుర్కోడానికి ‘IT ఆర్మీ’ని తయారు చేసింది ఉక్రెయిన్. సోమవారం నాటికి టెలిగ్రామ్‌లో దాదాపు 2 లక్షల మంది వినియోగదారులకు సొంతం చేసుకుంది. ‘ఐటీ ఆర్మీ ఆఫ్ ఉక్రెయిన్’ అని పిలవబడే ఈ టీమ్ ఇది రష్యన్ సైబర్ దాడులతో పోరాడటానికి, రష్యన్ సైట్‌లు, వారి ఏజెంట్లను అడ్డుకొంటూ దేశానికి సహాయం చేయడానికి సాంకేతిక సహాయం అందించనుంది. రష్యా ప్రధాన బ్యాంకులలో ఒకటైన స్బేర్‌బ్యాంక్ పై ఈ ఐటీ ఆర్మీ దాడి చేసింది. ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారులు టెలిగ్రామ్ లింక్‌ను ట్వీట్ చేస్తూ ‘ఐటి ఆర్మీ’ని కూడా సమర్థిస్తున్నారు. ‘‘మేం ఐటీ ఆర్మీని రూపొందిస్తున్నాం. డిజిటల్ టాలెంట్స్ ఉన్న వ్యక్తులు కావాలి. అందరికీ పనులు అప్పజెప్పుతాము. మేము సైబర్ ఫ్రంట్‌లో పోరాడుతూనే ఉన్నాము.”అని ఉక్రెయిన్ ఉప ప్రధాన మంత్రి, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మంత్రి మైఖైలో ఫెడోరోవ్ ట్వీట్ చేశారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య సైబర్ యుద్ధం తీవ్రమైంది, రష్యా కొత్త విధ్వంసక మాల్వేర్‌ను ఉపయోగించి ఉక్రేనియన్ సంస్థలకు చెందిన సిస్టమ్‌లపై డేటాను శాశ్వతంగా నాశనం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం వల్ల హ్యాకింగ్ గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను పెంచుతున్నాయి. రష్యా-మద్దతుగల హ్యాకర్లు ఇప్పటికే అనేక ఉక్రేనియన్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, బ్యాంకులను హ్యాక్ చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-UA) ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఉక్రెయిన్ సైనిక సిబ్బందికి చెందిన ప్రైవేట్ ఖాతాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఫిషింగ్ చేస్తున్నారని తెలిపింది.

మరో వైపు ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు మొదల‌య్యాయి. బెలార‌స్ కేంద్రంగా చర్చలు మొదలయ్యాయి. బెలార‌స్‌లో ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన‌ట్లుగా అంత‌కుముందు బెలార‌స్ విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది. ర‌ష్యాకు అనుకూలంగా వ్య‌వ‌హరిస్తున్న బెలార‌స్‌లో చ‌ర్చ‌ల‌కు తాము వ్య‌తిరేక‌మంటూ రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ ప్ర‌క‌టించారు. చ‌ర్చ‌ల‌కు తొలుత ర‌ష్యానే ప్ర‌తిపాద‌న చేయ‌గా.. అందుకు అంగీక‌రించిన జెలెన్‌స్కీ చ‌ర్చ‌ల‌ను బెలార‌స్‌లో కాకుండా త‌ట‌స్థ వేదిక‌పై జ‌రిపితే ఆలోచిస్తామంటూ చెప్పారు. కానీ ఆ తర్వాత బెలార‌స్‌లోనే చ‌ర్చ‌ల‌కు జెలెన్‌స్కీ అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది.