More

    కాబూల్ ఎయిర్ పోర్టుకు రావద్దని చెబుతున్న అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా

    కాబూల్ విమానాశ్రయం వద్ద రోజు రోజుకీ పరిస్థితులు అత్యంత దారుణంగా తయారవుతున్నాయి. ఆ దేశం నుంచి బయటపడేందుకు వివిధ దేశస్తులతో పాటు ఆఫ్ఘన్ ప్రజలు కూడా కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వేల సంఖ్యలో చేరుకున్న ప్రజలు.. ఏదో ఒక విమానంలో దేశం దాటేందుకు వారు యత్నిస్తున్నారు.

    ఇక కాబూల్ విమానాశ్రయం వద్ద ఉగ్రవాద దాడి జరిగే ప్రమాదముందని అమెరికా సహా వివిధ దేశాలు హెచ్చరించాయి. ఆ ప్రాంతంలో ఎవరూ ఉండొద్దని తమతమ దేశాల పౌరులకు సూచించాయి. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్ దాడులకు తెగబడే అవకాశం ఉందని, ఎవరూ విమానాశ్రయం చుట్టుపక్కలకు రావొద్దని తమ ప్రజలకు పలు దేశాలు సూచించాయి. యాబీ గేట్, తూర్పు గేట్, ఉత్తర గేట్ వద్ద ఉన్న అమెరికా ప్రజలంతా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.
    ఉగ్రవాద దాడి ముప్పు అత్యంత ఎక్కువగా ఉందని ఆస్ట్రేలియా విదేశాంగ వ్యవహారాల శాఖ హెచ్చరించింది. కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఆస్ట్రేలియన్లు ఎవరూ రావొద్దని సూచించింది. ఒకవేళ ఎవరైనా ఉండి ఉంటే వెంటనే అక్కడి నుంచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని, తదుపరి సూచనలు వచ్చే వరకు వేచి చూడాలని తెలిపింది. బ్రిటన్ కూడా ఇలాంటి హెచ్చరికలే చేసింది. ఐదు రోజుల్లో అమెరికా సహా నాటో దళాల ఉపసంహరణ పూర్తి కావాల్సి ఉంది. ఆ డెడ్ లైన్ దగ్గరపడుతోంది. ఇప్పటికే బెల్జియం, ఫ్రాన్స్ లు తమ తమ దళాలను పూర్తిగా వెనక్కు తీసుకెళ్లినట్టు ప్రకటించాయి. బలగాల ఉపసంహరణ కోసం కొన్ని రోజుల పాటు తరలింపు చర్యలను తగ్గిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.

    ఎయిర్ పోర్టు వద్ద తాగునీటి కోసం, ఆహారం కోసం వారంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం అందక ఎంతోమంది సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఇదే అదనుగా భావించి, ఎయిర్ పోర్ట్ వెలుపల తాగునీరు, ఆహారాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఒక లీటర్ వాటర్ బాటిల్ ను 40 డాలర్లకు (దాదాపు రూ. 3 వేలు), ఒక ప్లేట్ భోజనాన్ని 100 డాలర్లకు (దాదాపు రూ. 7,500) విక్రయిస్తున్నారు.

    Trending Stories

    Related Stories