ఉధంపూర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి

0
664

జమ్మూకశ్మీర్ ఉధంపూర్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పట్నిటాప్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ లోని ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెలికి తీసిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరూ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. మేజర్ ర్యాంకు కలిగిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించినప్పటికీ దురదృష్టవశాత్తు వారిని దక్కించుకోలేకపోయామని ఈ సందర్భంగా ఓ ఆర్మీ అధికారులు తెలిపారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

తుక్కు అయిపోయిన హెలికాప్టర్ నుంచి గాయపడ్డ పైలట్లను స్థానికులు బయటకు తీస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ, ఈ వార్త వినగానే చలించిపోయానని చెప్పారు. “ఇద్దరు యువ ఆర్మీ పైలట్లు, మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనూజ్ రాజ్‌పుత్, ఉధంపూర్ సమీపంలో ఈరోజు జరిగిన చీతా హెలికాప్టర్ ప్రమాదంలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలకు మరియు ఫ్లయింగ్ యూనిట్‌కు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని” ఆర్మీ తెలిపింది.