రాజకీయాల్లో దేన్నైనా సహించగలము.. ద్రోహాన్ని కాదు: అమిత్ షా

0
813

శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి ద్రోహం చేసాడని.. ఆయనకు సరైన గుణపాఠం నేర్పాలని కేంద్ర హోం మంత్రి, బీజేపీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా ఈ రోజు ముంబైలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో అన్నారు. “మేము రాజకీయాల్లో దేన్నైనా సహించగలము కానీ ద్రోహాన్ని సహించలేము” అని అమిత్ షా సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. అమిత్ షా మహారాష్ట్ర బీజేపీ నేతలతో నిర్వహించిన ఈ సమావేశంలో కమలనాథుల వైఖరి స్పష్టమైంది. ఉద్ధవ్ థాకరే బీజేపీకి నమ్మకద్రోహం చేశాడని, అతడికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అమిత్ షా అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సహించవచ్చేమో కానీ నమ్మకద్రోహాన్ని మాత్రం భరించలేమని.. త్వరలో జరగనున్న బృహన్ ముంబయి కార్పొరేషన్ ఎన్నికల్లో మిషన్ 150 సాధించడం ద్వారా ఉద్ధవ్ థాకరేకు బుద్ధి చెప్పాలని అమిత్ షా బీజేపీ నేతలకు స్పష్టం చేశారు.

ప్రభుత్వం మారిపోడానికి, తదనంతర పరిణామాలకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కారణమని అమిత్ షా సమావేశంలో ఆరోపించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అతని దురాశ కారణంగా పార్టీలోని ఒక వర్గం అతనికి వ్యతిరేకంగా మారడానికి కారణమని అమిత్ షా అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి ద్రోహం చేయడమే కాకుండా సిద్ధాంతానికి కూడా ద్రోహం చేసాడు. మహారాష్ట్ర ప్రజల ఆదేశాన్ని కూడా అవమానించాడని షా అన్నారు. ఆయన అధికార దాహం కారణంగా నేడు ఆయన పార్టీ కుంచించుకుపోయిందని అన్నారు. “మేము ఉద్ధవ్ ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవిని ఎన్నడూ వాగ్దానం చేయలేదని ఈ రోజు నేను మళ్లీ చెప్పాలనుకుంటున్నాను. మేము బహిరంగంగా రాజకీయాలు చేసే వ్యక్తులం, మూసి ఉన్న గదులలో కాదు” అని అమిత్ షా నొక్కిచెప్పారు. రాజకీయాల్లో మోసం చేసేవారిని శిక్షించాల్సిందేనని అన్నారు.