More

    హిందుత్వకు ద్రోహం చేసిన శివసేన, ఉద్ధవ్: అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు

    అధికారం కోసం శివసేన హిందుత్వకు ద్రోహం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికలను గుర్తుచేస్తూ, దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ఎన్నికలు జరగాలని బీజేపీ, అప్పటి మిత్రపక్షం శివసేన నిర్ణయించుకున్నాయని, అయితే ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని పార్టీ ముఖ్యమంత్రి పదవి కోసం హిందుత్వ సిద్ధాంతంతో రాజీపడిందని కేంద్ర హోంమంత్రి అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోరాడాలని అమిత్ షా సవాలు విసిరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే, సంకీర్ణం విజయం సాధించడంతో, ముఖ్యమంత్రి పదవిపై శివసేన బీజేపీతో విడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారం కోసం హిందుత్వ విష‌యంలో శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ థాకరే రాజీ ప‌డ్డార‌ని అమిత్ షా ఆరోపించారు. సేన‌, కాంగ్రెస్‌, ఎన్సీపీల‌తో కూడిన మ‌హా వికాస్ అఘ‌డి (ఎంవీఏ) స‌ర్కార్ ప‌నితీరు పేల‌వంగా ఉంద‌ని విమర్శించారు.

    పుణేలో ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హ శంకుస్ధాప‌న‌తో పాటు బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో అమిత్ షా పాల్గొన్నారు. ఎంవీఏ స‌ర్కార్‌ను భిన్న‌దారుల్లో వెళుతున్న మూడు చ‌క్రాల బండిగా అభివ‌ర్ణించారు. ఈ ప్ర‌భుత్వం సాఫీగా సాగ‌డం లేద‌ని కేవ‌లం కాలుష్యం వెద‌జ‌ల్లుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. 2019లో బీజేపీ నుంచే సీఎం ఎన్నిక‌వుతార‌ని తాను చెప్పినా అధికార దాహంతో వారు హిందుత్వ‌తో రాజీప‌డ్డార‌ని అమిత్ షా అన్నారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌ను కాంగ్రెస్ ప‌లుమార్లు అవ‌మానించింద‌ని.. బీజేపీ కేంద్రంలో, ప‌లు రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే అంబేద్క‌ర్‌తో అనుబంధ‌మున్న ఐదు ప్రాంతాల‌ను స్మృతి స్ధలాలుగా మార్చామ‌ని తెలిపారు. న‌రేంద్ర మోదీ ప్ర‌ధాని అయ్యే వ‌ర‌కూ రాజ్యాంగ దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌లేద‌ని అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగిందని షా ఆరోపించారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పదేళ్లు పాలించింది. 12 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆర్థిక వ్యవస్థ నాశనం చేయబడిందని అమిత్ షా విమర్శలు గుప్పించారు.

    Trending Stories

    Related Stories