కన్హయ్య హత్య కేసు నిందితులపై దాడి.. కొట్టింది ఎవరంటే..?

0
765

ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య హత్య కేసు నిందితులపై దాడి జరిగింది. జైపూర్ లోని కోర్టు ఆవరణలో లాయర్లు వారిపై దాడికి పాల్పడ్డారు. కన్హయ్య హత్య తర్వాత హంతకులు అక్తరీ, మహ్మద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు నిందితులను జైపూర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టులో శనివారం హాజరుపరిచారు. కోర్టు ఆవరణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు నిందితులను ఎన్‌ఐఏ కోర్టు ఈరోజు 10 రోజుల రిమాండ్‌ విధించింది. కోర్టు నుండి నిందితులను బయటకు తీసుకువెళ్తున్న క్రమంలో న్యాయవాదులు ఒక్కసారిగా వారిపై దాడికి దిగారు. కన్హయ్య హంతకులకు మరణ శిక్ష విధించాలని నినాదాలు చేశారు. ఎన్ఐఏ అధికారులు హంతకులను అక్కడి నుండి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత సుపుర్ శర్మకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో కన్హయ్య లాల్ ను రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్‌లు గత మంగళవారం గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.