ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటే అందుకోసం మొదట చొరవచూపాల్సింది హమాసేనని యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పష్టం చేసింది. అదికూడా 57 ఇస్లామిక్ దేశాల కూటమి హమాస్ ను పూర్తిగా వెనుకేసుకుని వస్తూ.. గాజాలో తాజా ఘర్షణలకు ఇజ్రాయెల్ దే బాధ్యత అంటూ తీర్మానం చేసిన సమయంలోనే, ఇటు ఇస్లామిక్ దేశాలకూటమికి భిన్నంగా యూఏఈ స్పందించడంపై పశ్చిమాసియాలోని ముస్లిం దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. యూఏఈ చేసిన తాజా ప్రకటనపై అటు పాలస్తీనీయులు సైతం ఖంగుతిన్నారు.
అంతేకాదు ఒక వేళా ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందంలో హమాస్ చొరచూపకపోతే.., గాజాలో మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టిన ప్రాజెక్టులకు తమ ఫండింగ్ ను సైతం నిలిపివేస్తామని యూఏఈ హమాస్ ను హెచ్చరించింది. గాజా స్ట్రిప్ లో పాలస్తీనావాసుల కోసం యూఏఈ కొన్నేళ్లుగా ఫండింగ్ చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు పూర్తికావాలంటే మొదట ఈ ప్రాంతంలో శాంతిసాధన ముఖ్యమని అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా యూఏఈ చేపట్టిన పవర్ ప్రాజెక్టులకు తాజాగా ఘర్షణల మూలంగా అంతరాయం ఏర్పడింది. గతంలో గాజాకు నిరాంతరాయంగా 16 గంటల విద్యుత్ సరఫరా జరిగేది. తాజా ఘర్షణల మూలంగా ఇది 5 గంటలకు పడిపోయింది. హమాస్ చర్యల కారణంగా అమాయకులైన పాలస్తీనీయులు నష్టపోతున్నారని, ఇప్పటికైనా ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందానికి చొరవచూపాలని హితవు పలికింది.
మే 11న ప్రాంరభమైన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో మరణించినవారి సంఖ్య 181కి చేరుకుంది. వీరిలో హమాస్ తో సంబంధం ఉన్న 20 మంది ఉగ్రవాదులు సైతం హతమయ్యారు.
అయితే యూఏఈ హమాస్ ను హెచ్చరిస్తూ చేసిన ప్రకటన వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్లుగా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో… యూఏఈ… ఇజ్రాయెల్ కు మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇజ్రాయెల్ తో తనకున్న 49 ఏళ్ల శత్రుత్వాన్ని వీడనాడి యూఏఈ శాంతి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో ఇజ్రాయెల్, యూఏఈ దేశాల మధ్య పూర్తిస్థాయిలో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ ఒప్పందాన్ని అప్పట్లోనే పాలస్తీనా ప్రభుత్వం.. హమాస్ తీవ్రంగా వ్యతిరేకించాయి. యూఏఈ తీరును తప్పుపట్టాయి. పశ్చిమాసియాలోని అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్ ను ఒక దేశంగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్న మూడో దేశంగా యూఏఈ నిలిచింది. అంతకు ముందు ఈజిప్టు, జోర్డాన్ దేశాలు ఇజ్రాయెల్ ను దేశంగా గుర్తిస్తూ దానితో శాంతి ఒప్పందాలు చేసుకున్నాయి.
అయితే ఇప్పుడు యూఏఈ ప్రకటనతోనైనా హమాస్ దిగివస్తుందా? ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకుంటుందా? లేక యుద్ధాన్ని కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి.