యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) తన దేశ పౌరులను భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ మరియు శ్రీలంకతో సహా మరికొన్ని దేశాలకు వెళ్లడాన్ని నిషేధించింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని యుఎఇ గత నెలలో 14 దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విధించగా.. వాటిని జూలై 21 వరకు పొడిగించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ జాతీయ అత్యవసర, సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ అథారిటీ విదేశీ ప్రయాణాలు చేసే వారికి పలు సూచనలు చేసింది. ప్రయాణ కాలంలో పౌరులు కోవిడ్ -19 కి సంబంధించిన అన్ని ముందు జాగ్రత్తలు, నివారణ చర్యలను పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
14 దేశాలైన లైబీరియా, నమీబియా, సియెర్రా లియోన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, జాంబియా, వియత్నాం, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, నైజీరియా, దక్షిణాఫ్రికా విమానాలు జులై 21 వరకు నిలిపివేయబడతాయని యుఎఇ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. అయితే కార్గో విమానాలు, అలాగే వ్యాపారం మరియు చార్టర్ విమానాలు పరిమితుల నుండి మినహాయింపు ఇచ్చారు.
ప్రయాణ సమయంలో కోవిద్-19 బారిన పడిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యుఎఇ ప్రభుత్వం తెలిపింది. సెల్ఫ్ ఐసొలేషన్ కు కట్టుబడి ఉండాలని .. ఆతిథ్య దేశాలలో వర్తించే అన్ని సూచనలు, అవసరాలు మరియు ఆరోగ్య ప్రోటోకాల్‌లకు అనుగుణంగా వ్యవహరించాలని యుఎఇ అధికారులు ఆదేశించారు. విదేశాల్లో ఉన్నప్పుడు కరోనా బారిన పడిన ఎమిరేట్ ప్రజలు సొంత దేశానికి చేరుకోవచ్చని.. అయితే అధికారులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని తెలిపారు.