పుదుచ్చేరిలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వాతావరణం అంతకంతకూ వేడెక్కుతోంది. పార్టీలన్నీ ఎత్తులు, పైఎత్తుల్లో నిమగ్నమై వున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ఇటీవల ఆరుగరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో సర్కార్ కుప్పకూలింది. ఇక, తాజాగా మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. మిత్రపక్షం డీఎంకేకు చెయ్యిచ్చేసి.. ఒంటరిగా బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట. ఇప్పటికే తమిళనాట డీఎంకేతో సంబంధాలను తెంచుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. అదే జరిగితే పుదుచ్చేరిలోనూ ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవచ్చు. అంతేకాదు, ఈ పరిణామం బీజేపీపైనా ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు అన్నా డీఎంకే, ఎన్.ఆర్. కాంగ్రెస్‌లతో కలిసి బరిలో దిగుతున్న బీజేపీ.. పుదుచ్చేరిలో విజయం సాధించాలని కృత నిశ్చయంతో వుంది. ఒకవేళ డీఎంకే, కాంగ్రెస్ మైత్రి విచ్ఛిన్నమైతే.. ఎన్.ఆర్. కాంగ్రెస్ కూడా ఎన్డీఏ నుంచి వైదొలిగి ఒంటరిగా పోటీచేసి అవకాశం వుంది. ఇదే సమయంలో డీఎంకేతో పొత్తు పైన ఆసక్తి కనబరుస్తోంది. అటు.. ఎన్.ఆర్. కాంగ్రెస్ ఎన్డీఏ నుంచి బయటికొస్తే.. జట్టుకట్టేందుకు డీఎంకే కూడా ఉత్సాహంగా వుంది. ఇప్పటికే ముగ్గురు ఎన్.ఆర్. కాంగ్రెస్ నేతలు డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ ని చెన్నైలో కలుసుకుని తమతో పొత్తు కుదుర్చుకోవలసిందిగా.. పుదుచ్చేరి డీఎంకే నేతలకు నచ్చ్చజెప్పాలని కోరారు. లేదా ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.
అటు, ఎన్.ఆర్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.రంగసామి బీజేపీతో సీట్ల సర్దుబాటుపై అసంతృప్తితో ఉన్నారు. తమిళనాడు పరిణామాలను ఆయన జాగ్రత్తగా గమనిస్తున్నారు. మొత్తం మీద ఈ కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ.. తనకు అనువైన మార్గాల కోసం అన్వేషిస్తోంది ఇక్కడ కాంగ్రెస్ ప్రాబల్యాన్ని కట్టడి చేయాలని యోచిస్తోంది. ఇదిలా ఉండగా ఎన్.ఆర్. కాంగ్రెస్ ఎన్డీయేలో భాగమని, మరో రెండు రోజుల్లో ఎన్డీయే నేతలు సమావేశమై, పుదుచ్చేరి ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిపైన, నియోజకవర్గ ఒప్పందాలపైన చర్చిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.