అమెరికాలో పోలీసులు అనవసరంగా యువకులపై రాక్షసి దాడికి పాల్పడుతూ ఉంటారు. అందులోనూ నల్ల జాతీయులు అంటే అక్కడి పోలీసులకు చులకన భావం ఎక్కువ. ఐతే తాజాగా అమెరికా పోలీసుల తీరు మరోసారి తీవ్ర వివాదాస్పదంగా మారింది. మెంఫిస్ నగరంలో ఈనెల మొదటి వారంలో టైర్ నికోల్స్ అనే యువకుడి పై కొంత మంది పోలీసులు అమానుషంగా దాడి చేయడంతో అతడు చనిపోయాడు.మృతుడు, దాడి చేసిన పోలీసులు నల్లజాతీయులే. దాడికి సంబంధించిన పూర్తి ఫుటేజ్ ను అధికారిక వర్గాలు విడుదల చేశాయి.
ఇందులోని దృశ్యాలు హృదయవిదారకంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతోనే మెంఫిస్ నగర పోలీసులు టైర్ నికోల్స్ ను ఆపినట్లు మొదట వార్తలు వచ్చాయి. తాజాగా విడుదలైన వీడియోలో అలా లేదు. తను ఏ తప్పు చేయలేదని చెప్తున్నప్పటికీ పోలీసులు నిర్దయగా వ్యవహరించడం కనిపిస్తుంది. ముందుగా అతడిని కారులోంచి బయటకు లాగారు.
చేతులు విరగొట్టమని ఒక పోలీసు ఆదేశించగా అతని రోడ్డుపై కళ్లతో తొక్కి పెట్టడం కనిపిస్తుంది. బాధితుడు వారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన అతన్ని వెంబడించి పోలీసులు పట్టుబడిన వెంటనే ఎలాంటి కనికరం లేకుండా చాలా సేపు పిడి గుద్దులు కురిపించారు. అతను బాధతో విలవిలలాడుతూ వదిలేయమని ప్రాధేయ పడడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఈ నెల 7న ఈ ఘటన జరగగా చికిత్స పొందుతూ నికోల్స్ ఈ నెల పదవ తేదీన మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులపై సెకండ్ డిగ్రీ హత్యా నేరం కింద అభియోగాలు మోపారు. నికోల్స్ మృతి పట్ల అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని నిరసిస్తూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శాంతియుత ప్రదర్శనలు జరిగాయి.
దీనితో మెంఫిస్ నగరం స్తంభించిపోయింది. ఈ నగరంలోని పాఠశాలలు, క్రీడా పోటీలు, వ్యాపార సమావేశాలు రద్దు అయ్యాయి. ఈ పరిణామాల నడుమ మెంఫిస్ పోలీస్ విభాగం తాజాగా స్కార్పియన్ అనే స్పెషల్ యూనిట్‌ను రద్దు చేసింది. కొంతమంది హేయమైన చర్యలు స్కార్పియన్‌కు చెడ్డపేరు తెచ్చిపెట్టాయని పోలీస్ ఉన్నత అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా మెంఫిస్ పోలీసు విభాగం చర్యలు తీసుకోవడం అవసరమని.. ప్రజాహితం దృష్ట్యా ఈ యూనిట్‌ను శాశ్వతంగా రద్దు చేస్తున్నామని పోలీసు డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు.. నికోలస్ కుటుంబం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇదిలా ఉండగా.. కారు దొంగతనాలు, ముఠా సంబంధిత నేరాల వంటి ఘటనపై దృష్టి సారించేందుకు 2021 అక్టోబరులో స్కార్పియన్ యూనిట్ ప్రారంభమైంది. 50 మంది పోలీసులతో కూడిన ఈ బృందం.. ప్రత్యేక ప్రాంతాల్లో నేరాలను తగ్గించేందుకు పని చేసింది. నికోల్స్ ఘటన నేపథ్యంలో తాజాగా రద్దయింది.