ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు

0
725

బుధవారం పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అన్సార్ గజ్వతుల్ హింద్, లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులను అన్సార్ ఘజ్వాతుల్ హింద్‌కు చెందిన సఫత్ ముజఫర్ సోఫీ అలియాస్ మువావియా, లష్కర్ కు చెందిన ఉమర్ తేలీ అలియాస్ తల్హాగా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీనగర్‌లోని ఖోన్‌మో ప్రాంతంలో సర్పంచ్‌ను హత్య చేయడంతో పాటు పలు ఉగ్రదాడుల కేసుల్లో వీరిద్దరూ వాంటెడ్‌గా ఉన్నారని పోలీలు చెప్పారు. ఇద్దరు ఉగ్రవాదులు ఇటీవల త్రాల్‌కు స్థావరాన్ని మార్చుకున్నారని పోలీసులు తెలిపారు.

స్థానికేతరులపై దాడులు జరుగుతూ ఉండడంతో కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా నుండి మంగళవారం నాడు బీహార్ కు చెందిన వలస కార్మికులు పెద్ద సంఖ్యలో తమ ఇంటికి బయలుదేరారు. సోమవారం ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు కార్మికులకు తుపాకీ గాయాలు కావడంతో మరికొందరు సొంత ఊళ్లకు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. తీవ్రవాదుల దాడిలో గాయపడిన ఇద్దరు కార్మికులను పాతాళకళేశర్ పటేల్, అతని తండ్రి జోకు పటేల్‌గా గుర్తించారు. పశ్చిమ చంపారన్‌లోని కొల్లువా చౌతరావా పంచాయతీకి చెందిన దాదాపు 250 మంది కార్మికులు దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని లజూరా, పుచ్చల్‌లో పనిచేస్తున్నారు. వారిలో చాలా మంది పొట్టకూటి కోసం ఈ సంవత్సరం మార్చిలో అక్కడికి వచ్చారు. ఇక్కడ పరిస్థితి అనుకూలించకపోవడంతో వారంతా తమ ఇళ్లకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు.

పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ గదుల్లోకి వెళ్లిపోయారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫోటోగ్రాఫ్‌లను పంచుకోవడానికి నిరాకరించారు. వారి వేతనాలు చెల్లించగానే వెళ్లిపోవడానికి చాలా మంది స్థానికేతరులు సిద్ధంగా ఉన్నారు. పౌరులు, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ దిలాబ్‌ సింగ్‌ హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. కశ్మీర్‌ లోయలో శాంతి నెలకొనడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, దానికి భంగం కలిగించడానికి దాడులకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.