పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై గ్రనేడ్ దాడి

0
868

మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్‌లోని ఓ భవనం లక్ష్యంగా గ్రెనేడ్‌ను విసిరినట్టు తెలుస్తోంది. దాడితో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కారులో వచ్చిన ఇద్దరు అనుమానిత వ్యక్తులు రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రనేడ్ (ఆర్పీజీ)ని 80 మీటర్ల దూరం నుంచి ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇది లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా పేలుడు మాత్రం సంభవించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాకెట్ లాంచర్‌ను డ్రోన్ ద్వారా ప్రయోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఉగ్రదాడి కాదని, పేలుడు మాత్రమేనని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దాడి కారణంగా కార్యాలయంలోని మూడో అంతస్తులో కొన్ని కిటికీలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇంటెలిజెన్స్ అధికారులు, దర్యాప్తు అధికారులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. గత కొన్ని నెలలుగా, పాకిస్తాన్ నుండి పంజాబ్‌లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న సంగతి తెలిసిందే..! ఎప్పటికప్పుడు భారత సైన్యం ఈ అక్రమ చొరబాట్లను అడ్డుకుంటూ ఉంది.

మొహాలీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్విందర్ సంధు ప్రకారం, భవనం వద్ద రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (RPG) లాంచ్ చేయబడింది. దీనిపై విచారణ చేసేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక బృందాన్ని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపనుంది. మొహాలీ పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం “సెక్టార్ 77, SAS నగర్‌లోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో రాత్రి 7.45 గంటల సమయంలో చిన్న పేలుడు సంభవించింది. ఎటువంటి నష్టం జరగలేదు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను పిలిపించారు.” అని ఉంది.