More

    పాక్ లో ఇద్దరు సిక్కుల కాల్పివేత..

    పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఇద్దరు సిక్కులను దుండగులు కాల్చిచంపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని పెషావర్‌లో బడా బజార్‌లో ఈ ఇద్దరు సిక్కులు చాలా కాలంగా దుకాణం నడుపుతున్నారు.

    దుండగుల కాల్పుల్లో మృతి చెందిన వారు కుల్జీత్ సింగ్, రంజిత్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. దుకాణంలో కూర్చున్న వీరిపై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలేవి అంతుబట్టలేకుండా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

    ఇద్దరు సిక్కుల హత్య అనంతరం పెషావర్ లో అల్లర్లు చెలరేగకుండా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ స్థానిక పోలీసులను ఆదేశించారు. ఇద్దరు సిక్కుల హత్య బాధాకరమని, హంతకులను వదిలిపెట్టబోమని ఖాన్ అన్నారు. కాగా పాకిస్తాన్ లో ఉన్న సిక్కులపై గత కొంతకాలంగా దాడులు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ నేత మంజిందర్ సిర్సా అన్నారు. పెషావర్‌ను విడిచిపెట్టమని పాకిస్తాన్‌లోని సిక్కులను బెదిరిస్తున్నారని, ఈవిషయాన్ని పలుమార్లు పాకిస్థాన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సిర్సా ఆవేదన వ్యక్తం చేశారు.

    పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న సిక్కుల హక్కులను అక్కడి ప్రభుత్వం కాలరాస్తోందని సిర్సా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లోని హైకమిషన్‌ను సంప్రదించాలని.. భారత్ లోని పాకిస్థాన్ రాయబారిని కూడా పిలిపించి వివరణ కోరాలని మంజిందర్ సిర్సా డిమాండ్ చేశారు.

    Trending Stories

    Related Stories