National

కిషన్ రెడ్డికి రెండు శాఖల కేటాయింపు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రెండు శాఖలను కేటాయించారు. కేంద్ర సాంస్కృతిక, టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు టూరిజం మంత్రిగా, ఉదయం 10 గంటలకు సాంస్కృతికశాఖ మంత్రిగా, ఉదయం 10.30 గంటలకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా ఆయా కార్యాలయాల్లో కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.

కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జి.కిషన్‌రెడ్డికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు దక్కాయి. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మూడు శాఖలకు అయిదుగురు సహాయ మంత్రులను కేటాయించారు. శ్రీపాద యశో నాయక్, అజయ్‌భట్‌లను కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రులుగా, మీనాక్షి లేఖి, అర్జున్‌ రాం మేఘ్వాల్‌లను సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులుగా, బీఎల్‌ వర్మ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించనున్నారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి మొట్టమొదటి కేబినెట్‌ మంత్రిగా తనకు అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్తకు అవకాశం దక్కుతుందనడానికి తనకు కేబినెట్‌ పదవి రావడమే ఒక నిదర్శనమని తెలిపారు. హోం మంత్రి అమిత్‌ షాతో కలిసి పనిచేసిన అనుభవం ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. 2019లో లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన తర్వాత హోంశాఖ సహాయమంత్రిగా అమిత్‌ షా తీసుకున్న నిర్ణయాలు, తీసుకొచ్చిన చట్టాల అమలు విషయంలో నా వంతు ప్రయత్నం చేశానన్నారు. జమ్మూ, కాశ్మీర్‌లో గతంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి, ఉగ్రవాద బాధిత నేపథ్యంలో ఆర్టికల్‌ 370 తొలగించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ ఎక్కువగా పర్యటించాల్సి వచ్చిందని అన్నారు.

కేంద్ర కేబి నెట్‌ మంత్రిగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు సాయం చేయడంలో శక్తివంచన లేకుండా పని చేస్తానని.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావాలని అన్నారు.. ఈ వ్యవహారాల్లో తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని కూడా అన్నారు. ఈ రెండేళ్ళలో ఏ రోజూ అధిష్టానం వద్ద పదోన్నతి కోసం అడగలేదని.. అలా అడిగే అవకాశం బీజేపీలో చాలా తక్కువగా ఉంటుందని మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రివర్గంలో బడుగు, బలహీనవర్గాల వారికి అత్యధిక ప్రాతినిధ్యం లభించిందన్నారు. కేంద్ర కేబినెట్‌ మంత్రిగా వెంకయ్యనాయుడు తర్వాత నాకు అవకాశం లభించిందని.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా జమ్మూ, కశ్మీర్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించిన కారణంగా గత రెండేళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండలేకపోయానని అన్నారు. ఇకపై తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తరపున అందుబాటులో ఉంటానని వెల్లడించారు.

కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జి.కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు కాల్చి సందడి వాతావరణాన్ని సృష్టించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two + 18 =

Back to top button