ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారతసైన్యం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శ్రీనగర్‌లోని దన్మార్ ప్రాంతంలో ఉన్న ఆలమ్దార్ కాలనీలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సమయంలో సైన్యంపై తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరణించినవారిని లష్కరే తొయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించామని చెప్పారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.
శ్రీనగర్‌లో భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందారని అధికారికంగా వార్తలు వచ్చాయి. ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందినవారని కాశ్మీర్ పోలీసు విభాగం కూడా ధృవీకరించింది. శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ ప్రారంభమైంది. గత నెలలో జమ్మూలోని భారత వైమానిక దళం (ఐఎఎఫ్) స్టేషన్ వద్ద డ్రోన్ దాడి ఘటన తర్వాత భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్లను మొదలుపెట్టాయి. ఉగ్రవాదుల పట్ల వ్యవహరించే తీరులో తమ విధానంలో ఎటువంటి మార్పు ఉండదని భారత సైన్యం స్పష్టం చేసింది.